IIT Admissions: 'ఐఐటీ' ప్రవేశాల్లో అమ్మాయిలు 19 శాతమే, సమగ్ర నివేదిక విడుదల
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 3,422 మంది అమ్మాయిలకు సీట్లు దక్కాయి.
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొత్తం 3,422 మంది అమ్మాయిలకు సీట్లు దక్కాయి. మొత్తం 23 ఐఐటీల్లో 17,385 బీటెక్, బీఎస్, బీటెక్+ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొత్తం 17,340 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో అమ్మాయిలు 19.70% దక్కించుకున్నారు.
గతేడాది (2022-23 విద్యా సంవత్సరం) 3,310 సీట్లు(20.60%) దక్కాయి. ఐఐటీల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్ జులై నెలాఖరులో ముగిసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో ఐఐటీ గువాహటి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షతోపాటు జోసా కౌన్సెలింగ్-2023పై సమగ్ర నివేదికను తాజాగా విడుదల చేసింది.
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 1,89,487 మంది దరఖాస్తు చేశారు. అందులో 43,769 మంది ఉత్తీర్ణులయ్యారు. చివరకు 17,340 మంది ప్రవేశాలు పొందారు. వారిలో 4,342(25.04%) మంది ఐఐటీ హైదరాబాద్ జోన్(ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ) విద్యార్థులున్నారు. అందులోనూ ఏపీ, తెలంగాణ విద్యార్థులే దాదాపు 3,500 మంది ఉంటారని నిపుణుల అంచనా.
తొలి 50 ర్యాంకర్లలో 46 మంది ముంబయిలో చేరగా.. దిల్లీలో ఇద్దరు, చెన్నైలో ఒకరు ప్రవేశం పొందారు. ఒకరు ఎక్కడా చేరలేదు. తొలి వెయ్యి ర్యాంకర్లలో ముంబయి-245, దిల్లీ-208, కాన్పూర్-120, మద్రాస్-113, ఖరగ్‌పూర్-81, రూర్కీ-66, గువాహటి-63, హైదరాబాద్-38, వారణాసి-23, ఇండోర్‌లో ఇద్దరు చేరారు. అంటే తొలి వెయ్యి ర్యాంకర్లలో 41 మంది ఐఐటీల్లో చేరకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లేదా విదేశాలలో చదివేందుకు వెళ్లి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.
జేఈఈ మెయిన్-2024 దరఖాస్తు ప్రారంభం..
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2024 మొదటి విడత దరఖాస్తు ప్రక్రియ షెడ్యూలు ప్రకారం నవంబరు 1న ప్రారంభంకావాల్సి ఉండగా... నవంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా నవంబర్ 30న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో జేఈఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నవంబరు 1న విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.11.2023
➥ దరఖాస్తుకు చివరితేదీ: 30.11.2023
➥ ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 30.11.2023 (రాత్రి 11.50 గంటల వరకు)
➥ పరీక్ష కేంద్రాల (నగరాలు) ప్రకటన: 2024, జనవరి రెండో వారంలో
➥ అడ్మిట్‌కార్డులు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
➥ ఆన్‌లైన్ పరీక్షలు: 24.01.2024 నుంచి 01.02.2024 వరకు
➥ పరీక్ష ఫలితాలు: 12.02.2024.