IAS Officer Salary : ఐఏఎస్ అధికారుల జీతం ఎంతో తెలుసా ? ఐటీ ఉద్యోగులతో పోలిస్తే
కలెక్టర్ అయితే హోదా వస్తుంది .. దానికి తగ్గట్లుగా జీతం వస్తుందా ? ఎంత జీతం వస్తుందో మీరే చూడండి
మా వోడు బాగా చదివేసి కలెక్టరయిపోతాడని ప్రతి తండ్రి కోరుకుంటాడు. కలెక్టర్ అయితే హోదా వస్తుంది.. మరి జీతం వస్తుందా ? కలెక్టర్ల హోదాను చూసి జీతం ఎంతో .. ఊహించనంత ఉంటుందని అనుకుంటారు. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు అయినా నెలకు జీతం రాకపోతే ఈఎంఐలు కట్టుకోలేక ఇబ్బంది పడాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏడో వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐఏఎస్ అధికారుల జీతాలు కూడా పెరగనున్నాయి. పెరిగిన తర్వాత ఇప్పుడే సర్వీసులోకి వచ్చిన ఐఏఎస్ అధికారికి అందే బేసిక్ శాలరీ రూ. 56,100. ఆశ్చర్యపోమాకండి.. అక్షరాలా రూ. యాభైఆరు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే.
అయితే ఇది బేసిక్ శాలరీ మాత్రమే. దీనికి రకరకాల అలవెన్స్‌లు యాడ్ అవుతాయి. హెచ్‌ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్ ఇలా చాలా రకాల అలవెన్స్‌లు వస్తాయి. ఎలా చూసినా అవి బేసిక్ కన్నా ఎక్కువగానే వస్తాయి. ఎలా చూసినా.. అన్ని అలవెన్స్‌లతో కలిసి ఓ ఐఎఎస్ ప్రారంభస్థాయి జీతం రూ. లక్ష పైన ఉంటుందన్నమాట. ఇక సర్వీసులో సీనియర్ అయ్యే కొద్దీ జీతం పెరుగుతూ వస్తోంది. ఐఏఎస్ అధికారుల్లో అత్యధిక క్యాడర్ కేబినెట్ సెక్రటరీ. ఆ స్థాయి అధికారికి నెలకు రూ. రెండున్నర లక్షల జీతం అందుతుంది. ఐఎఎస్ అధికారులందరికీ సర్వీస్.. క్యాడర్‌ను బట్టి శాలరీ మరిపోతూ ఉంటుంది.
నిజానికి వారికి వచ్చే జీతం... ఇప్పుడు ఐటీ ఉద్యోగుల కన్నా తక్కువే. ఐదు.. పదేళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఐటీ ఉద్యోగులు..రెండు, మూడు సంస్థలు మారితే.. ఏకంగా రూ. లక్ష జీతం దగ్గరకు చేరుకుంటున్నారు. సీనియార్టీ అలా పెరిగితే.. జీతం కూడా లక్షల్లోపెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు టాలెంట్ ఉన్న ఐటీ కంపెనీలో మేనేజర్ స్థాయి ఉద్యోగికి రూ. రెండున్నర లక్షలు చాలా సులువుగా వస్తూ ఉంటాయి. వారికి అనేక సౌకర్యాలు కూడా ఉంటాయి. వారంలో ఐదు రోజులు వర్కింగ్ డేస్ తో పాటు.. ఇతర టెన్షన్లు ఉండవు.
నిజానికి ఐఏఎస్ సాధించడాన్ని చాలా మంది గొప్పగా చెప్పుకుంటారు. కానీ అలా సాధించి కూడా సర్వీస్‌ను వదిలి పెట్టి.. ఇతర ప్రైవేటు సంస్థల్లో చేరిపోయేవారు కూడా చాలా మంది ఉంటారు. సివిల్ సర్వీస్ లో రాజకీయ ఒత్తిళ్లతో పాటు స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేకపోవడం... వ్యక్తిగత జీవితానికి అంత స్కోప్ ఉండకపోవడం వంటి సమస్యల వల్ల కొంత మంది సర్వీస్ సాధించి కూడా వదిలేస్తూంటారు.