GATE 2026 షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ తేదీలు, రిజిస్ట్రేషన్ పూర్తి వివరాలు- పరీక్ష ప్రాముఖ్యత ఇదే
GATE 2026 Registration Pattern | సిలబస్ విడుదల చేసింది. పరీక్షలు ఫిబ్రవరి 7,8,14,15, 2026 న. రిజిస్ట్రేషన్ ఆగస్టు 25, 2025 నుండి ప్రారంభం. స్కోర్ 3 సంవత్సరాలు చెల్లుతుంది.

GATE 2026 Syllabus | పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది బిగ్ న్యూస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2026 సిలబస్ విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2026.iitg.ac.inలో పూర్తి సిలబస్ చెక్ చేసుకోవాలి. మీరు కూడా గేట్ పరీక్షకు హాజరు కావాలని చూస్తున్నట్లయితే, సిలబస్‌ను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తరువాతే మీరు చదవడంపై ఫోకస్ చేస్తే సిలబస్ కంప్లీట్ చేయవచ్చు.
GATE 2026 పరీక్ష ఎప్పుడు జరుగుతుంది?
అధికారిక ప్రకటన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7, 2026న గేట్ పరీక్ష ప్రారంభమవుతుంది. ఇది నాలుగు రోజులలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీలలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. మార్చి 19, 2026న గేట్ ఎగ్జామ్ రిజల్ట్ ప్రకటిస్తారు. గేట్ స్కోర్ ఫలితం వచ్చిన తేదీ నుంచి 3 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఈ గేట్ ఎగ్జామ్ స్కోర్‌లను రాబోయే 3 సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభం..
గేట్ 2026 ఎగ్జామ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 25, 2025న ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆలస్య రుసుము (GATE Late Fees) లేకుండా సెప్టెంబర్ 25, 2025 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవాలంటే అందుకోసం లేట్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుందని ఐఐటీ గౌహతి వెల్లడించింది.
ఉద్యోగాలకు కూడా అవసరం
గేట్ స్కోర్ కేవలం బీటెక్ విద్యార్థులకు పీజీ ప్రవేశానికి మాత్రమే కాదు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో (PSUs) నియామకాలకు కూడా ఉపయోగపడుతుంది. చాలా ప్రముఖ సంస్థలు ఇంటర్వ్యూలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి.
ఈసారి GATEలో కొత్తగా ఏముంది?
ఈసారి గేట్ సిలబస్‌లో ఒక ప్రత్యేక మార్పు చేశారు. ఇంజనీరింగ్ సైన్సెస్ పేపర్‌లో ‘ఎనర్జీ సైన్స్’ అనే కొత్త విభాగాన్ని జత చేశారు. దీనితో పాటు మొత్తం 30 ప్రశ్నపత్రాలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు ఒకటి లేదా 2 పేపర్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు. అయితే, ఎవరైనా 2 పేపర్‌లు రాస్తే, నిర్ణీత జత ప్రకారం మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోవాలి.
గేట్ 2026 పరీక్షా విధానం
- గేట్ ఎగ్జామ్ మొత్తం మార్కులు: 100
- భాష: ఇంగ్లీష్
- జనరల్ ఆప్టిట్యూడ్ (GA): అన్ని పేపర్‌లలో 15 మార్కులు
- మిగిలిన పేపర్: సబ్జెక్ట్-నిర్దిష్టంగా 85 మార్కులు
మార్కింగ్ స్కీమ్
- సరైన సమాధానానికి ప్రశ్నకు 1 లేదా 2 మార్కులు
- 1 మార్కు కలిగిన ప్రశ్న తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ చేస్తారు
- 2 మార్కులు కలిగిన ప్రశ్నలో తప్పు సమాధానానికి 2/3 మార్కులు కట్ చేస్తారు






















