CPGET: సీపీగెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, అమ్మాయిలకే 73 శాతం సీట్లు
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబరు 29న పూర్తయింది. మొత్తం 30,176 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోగా.. 22,599 మందికి సీట్లు కేటాయించారు.
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబరు 29న పూర్తయింది. కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సులకు సంబంధించి మొత్తం 30,176 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోగా.. 22,599 మందికి సీట్లు కేటాయించారు. వీరిలో 16,496 మంది అమ్మాయిలే కావడం విశేషం. అంటే 73 శాతం సీట్లు అమ్మాయిలకే కేటాయించారు. ఇక అబ్బాయిల విషయానికొస్తే కేవలం 6,103 మాత్రమే సీట్లు పొందారు.
సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 4 లోపు ఆన్‌లైన్‌లో రిపోర్ట్‌తోపాటు స్వయంగా కళాశాలలో ఒరిజినల్ టీసీ సమర్పించాలని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి తెలిపారు. ఇతర ధ్రువపత్రాలైన ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ మెమోలు, కులం, ఈడబ్ల్యూఎస్, ఆదాయం తదితర వాటిని కేవలం పరిశీలనకు మాత్రమే చూపాలని, కళాశాలల్లో ఇవ్వొద్దని ఆయన సూచించారు. విద్యార్థుల నుంచి ఒరిజనల్ టీసీ మాత్రమే తీసుకోవాలని ప్రిన్సిపాళ్లను ఆయన ఆదేశించారు. రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది.
సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..
సీపీగెట్-2023 పరీక్షలను జూన్ 30 నుంచి జూలై 10 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షకు 22,468 మంది పురుషులు, 45,954 మంది మహిళలు సహా మొత్తం 68,422 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష ఫలితాలు ఆగస్టు 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 93.42 శాతం మంది అర్హత సాధించారు. అందులో 19,435 మంది పురుషులు, 40,230 మంది మహిళలు సహా మొత్తం 59,665 మంది పరీక్షలు రాశారు. వారిలో 18,172 మంది పురుషులు, 37,567 మంది మహిళలు సహా మొత్తం 55,739 మంది క్వాలిఫై అయ్యారు.
ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ మహిళా యూనివర్సిటీలతోపాటు హైదరాబాద్ జేఎన్‌టీయూలో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహించారు.
డిగ్రీ ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు..
➥ రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఇంతే సంఖ్యలో సీట్లున్నా, చేరిన వారి సంఖ్య 22,812 మాత్రమే. వీరిలోనూ 16,163 (71%) మహిళలు, 6,649 (29%) పురుషులు చేశారు.
➥ డిగ్రీలో ఏ సబ్జెక్టు చేసినా, పీజీలో ఇష్టమొచ్చిన సామాజిక కోర్సుల్లో చేరేందుకు వీలు కల్పిస్తున్నారు. ఆఖరుకు ఎంబీబీఎస్, బీటెక్ విద్యార్థులు కూడా ఎంఏ, ఎంకామ్ వంటి కోర్సుల్లో చేరే వీలుంది. ఎంఏ తెలుగు, ఇంగ్లిష్ కోర్సులకు ఏ గ్రూపుతో డిగ్రీ చేసినా అర్హులే.
➥ నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 5% నుంచి 20%కి పెంచారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ALSO READ:
'దోస్త్' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్, మరో 6,843 మందికి విద్యార్థులకు సీట్లు
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న డిగ్రీ సీట్ల భర్తీకి నిర్వహించిన 'దోస్త్' స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ద్వారా మరో 6,843 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబరు 30లోపు సంబంధిత కళాశాలలో ఆన్‌లైన్ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి సూచించారు. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 1,96,386 మంది విద్యార్లు సీట్లు పొందారని. తాజా రౌండ్‌తో కలిపి మొత్తం ప్రవేశాల సంఖ్య 2 లక్షలు దాటుతుందని ఆయన తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్టీరంగా యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ఎన్నారై కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్, ప్రవేశం ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కోరువారు నిర్ణీత నమూనాలో రూ.200 విలువచేసే నాన్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్‌పై అండర్‌టేకింగ్ ఇవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి.