AP POLYCET 2024 Counselling: ఏపీ పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు, కారణం ఇదే
AP POLYCET 2024: ఏపీ పాలిసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూలులో మార్పులు చోటుచేసుకున్నాయి. జూన్ 3న నిర్వహించాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 6న నిర్వహించనున్నారు. వెబ్ఆప్షన్ల తేదీల్లోను మార్పులు చేశారు.
AP POLYCET 2024 Counselling: ఏపీలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ మే 24న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్, జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు 144 సెక్షన్ విధించిన కారణంగా.. పాలిసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా షెడ్యూలులో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి మే 29న ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించారు.
కొత్త షెడ్యూలు ప్రకారం..
➥ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ఫీజు చెల్లింపు, ధృవపత్రాల వెరిఫికేషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు జరుగలేదు. అభ్యర్థులు జూన్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చు.
➥ అభ్యర్థులకు మే 27న ప్రారంభమైన ధ్రువపత్రాల పరిశీలన జూన్ 3 వరకు కొనసాగాల్సి ఉండగా.. జూన్ 3న నిర్వహించాల్సిన ధృవపత్రాల పరిశీలనను జూన్ 6న నిర్వహించనున్నారు. ప్రత్యేక క్యాటగిరి అభ్యర్ధులకు సైతం ఇదే షెడ్యూలు వర్తించనుంది.
➥ అభ్యర్థులు జూన్ 7 నుండి 10 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు జూన్ 11న అవకాశం కల్పించారు.
➥ ఆప్షన్లు నమోదుచేసుకున్న అభ్యర్థులకు జూన్ 13న సీట్లను కేటాయించనున్నారు.
➥ సీట్లు పొందినవారు జూన్ 14 నుండి 19 వరకు సంబంధిత కళాశాలలో వ్యక్తిగతంగా, ఆన్‌లైన్ విధానంలోనూ రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
➥ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల్లో జూన్ 14 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.
➥ విద్యార్థులు వెబ్‌సైట్ నుండి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సిద్దంగా ఉండాలి.
➥ కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీలో ఏప్రిల్ 27న ఎస్బీటీఈటీ పాలిసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రాథమిక కీని ఏప్రిల్ 30న విడుదల చేశారు. ఆన్సర్ కీపై విద్యార్థుల నుంచి మే 4 వరకు అభ్యంతరాలను స్వీకరించారు. తుది ఆన్సర్ కీని మే 5న SBTRT విడుదల చేసింది. మే 8న పాలిసెట్ ఫలితాలను విడుదల చేసింది.
ఈ ఏడాది పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,42,035 మంది విద్యార్ధులు హాజరుకాగా.. ఇందులో 1,24,430 మంది (87.61 శాతం) అర్హత సాధించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిలో బాలికలు 50,710 (89.81%) మంది ఉండగా.. బాలురు 73,720 (86.16%) మంది ఉన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. రాష్ట్రంలోని 267 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 కోర్సుల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ పాలిసెట్ కౌన్సెలింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: 24.05.2024 - 02.06.2024 వరకు
➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 27.05.2024 - 02.06.2024, 06.06.2024
➥ స్పెషల్ కేటిగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్: 31.05.2024 - 02.06.2024, 06.06.2024.
➥ వెబ్ ఆప్షన్ల నమోదు: 07.05.2024 - 10.06.2024.
➥ వెబ్‌ఆప్షన్లను మార్చుకునేందుకు గడువు: 11.06.2024.
➥ పాలిసెట్ సీట్ల కేటాయింపు: 13.06.2024.
➥ సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 14.06.2024 - 19.06.2024.
➥ పాలిటెక్నిక్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం: 14.06.2024.