Teacher Recruitment Scam: 'దీదీ' సర్కారుకు కలకత్తా హైకోర్టు బిగ్ షాక్, ఆ 25 వేల ఉపాధ్యాయ నియామకాలు రద్దు
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న కుంభకోణం మీద సంచలన తీర్పునిచ్చింది. నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది.
Teacher Recruitment Scam in West Bengal: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద షాక్ తలిగింది. రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న కుంభకోణం మీద సంచలన తీర్పునిచ్చింది. 2016 నాటి 'స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (SLST)' నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీని కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి వాపసు చేయాలని వెల్లడించింది.
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్-సి, గ్రూప్-డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ నిమిత్తం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన ఈ ధర్మాసనం.. 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినందున అది చెల్లదని తీర్పు వెలువరించింది. తక్షణమే ఆ నియామకాలను రద్దు చేసి కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ను సూచించింది. నాటి వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.
వేతనాలు తిరిగి చెల్లించాల్సిందే.. హైకోర్టు
2016 ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నాలుగు వారాల్లోగా తాము అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేయాలని కలకత్తా హైకోర్టుల ఆదేశించింది. అదికూడా తీసుకున్న జీతానికి 12 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని కోర్టు చెప్పింది. ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 23 లక్షల మంది ఈ పరీక్షను రాశారు. వారినుండి 25,753 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు చేపట్టాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి అవకతవకలు జరిగినట్లు ధర్మసనం తీర్పు ఇచ్చింది.
ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటాం: సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో 2016లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు చెల్లవంటూ ఏప్రిల్ 22న కలకత్తా హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. నియామకాలను రద్దు చేయడంతోపాటు వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలన్న కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని ఆమె తెలిపారు. హైకోర్టు తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా నిలుస్తామని మమత హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేయడం చట్ట విరుద్ధమని ఆమె అన్నారు. వారికి న్యాయం జరిగేవరకు పోరాడతామని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తామని స్పష్టంచేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు 8 ఏళ్లుగా తీసుకున్న వేతనాన్ని కేవలం 4 వారాల గడువులో చెల్లించడం ఎలా సాధ్యపడుతుందని మమతాబెనర్జి ప్రశ్నించారు.