AP SSC Exam Fee: ఏపీలో పదోతరగతి ఫీజు చెల్లింపు గడువు ఇదే! ఫీజు వివరాలు ఇలా!
ఏపీలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 10 వరకు పొడిగించారు. అయితే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబరు 30 వరకు అవకాశం కల్పించారు.
ఏపీలో పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 10 వరకు పొడిగించారు. అయితే ఆలస్య రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబరు 30 వరకు అవకాశం కల్పించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా డిసెంబరు 10లోపు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ.50 ఆలస్యరుసుముతో డిసెంబరు 12 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 30 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు పరీక్ష ఫీజు, దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యార్థులు ఫీజు మినహాయింపు కోసం రూ.650 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఫీజు ఇలా..
➦ రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
➦ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు మూడు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మూడు కంటే తక్కువ ఉన్నవారు రూ.110 పరీక్ష ఫీజు చెల్లించాలి.
➦ ఒక ఒకేషనల్ కోర్సులు చదివేవారు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
➦ వయసు తక్కువగా ఉన్నవారు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు తేదీలు..
➦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 10.12.2022.
➦ రూ.50 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.12.2022.
➦ రూ.200 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.12.2022.
➦ రూ.500 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.12.2022.
వీరికి ఫీజు నుంచి మినహాయింపు..
కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో రూ.24,000; గ్రామీణ ప్రాంతంలో రూ.20,000 ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాలలోపు బీడు భూమి ఉన్న విద్యార్థులు కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు.
పదోతరగతి మాదిరిప్రశ్నపత్రాలు, బ్లూప్రింట్ కోసం క్లిక్ చేయండి..
పదో తరగతిలో ఇకపై ఆరు పేపర్లే..
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో 11సబ్జెక్టులకు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు. 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్ధులు ఆరు పేపర్లు మాత్రమే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో విద్యార్ధులు అన్ని సబ్జెక్టులతో కలిపి 11పరీక్షలకు హాజరు కావాల్సి ఉండేది. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్టు పరీక్షలు రెండు పేపర్లుగా నిర్వహించే వారు. కరోనా కారణంగా రెండేళ్ళ పాటు విద్యార్ధులకు పరీక్షల నిర్వహణలో రకరకాల సమస్యలు తలెత్తాయి. విద్యార్ధులు ఎలాంటి పరీక్షలు లేకుండానే 8,9 తరగతుల నుంచి ఉత్తీర్ణులై పదిలోకి వచ్చేశారు. దీంతో 2021-22 విద్యా సంవత్సరంలో పదోతరగతి పరీక్షల్లో ఏడు ప్రశ్నాపత్రాలతోనే నిర్వహించారు. 2022లో జరిగిన పరీక్షల్లో సైన్స్ పరీక్షల్లో మాత్రమే రెండు ప్రశ్నాపత్రాలతో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది సైన్స్‌కు కూడా ఒకే పరీక్షగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, రసాయిన శాస్త్రం మూడు సబ్జెక్టులకు కలిపి ఒకే ప్రశ్నాపత్రంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గతంలో కరోనాకు ముందు పేపర్-1, పేపర్-2లుగా పరీక్షలు నిర్వహించే వారు. పేపర్ 1లో భౌతిక-రసాయిన శాస్త్రాలు, పేపర్-2లో జీవశాస్త్రం పరీక్ష నిర్వహించే వారు. ఇకపై సైన్స్ సబ్జెక్టులు అన్నింటికి కలిపి ఒకే ప్రశ్నాపత్రంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జీవశాస్త్రం(జువాలజీ) పరీక్షలు మాత్రం విడిగా వేరే జవాబు పత్రంలో రాయాలని పేర్కొన్నారు.