AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, 43 శాతం ఉత్తీర్ణత నమోదు
AP Inter Supply Results 2024: ఏపీలో ఇంటర్మీడియెట్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.
AP Inter First Year Supplementary Results: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter First Year Supplementary Results) బుధవారం (జూన్ 26) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సప్లిమెంటరీ పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రథమ సంవత్సరం ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి..
43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు..
➥ ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మొత్తం 43 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు మొత్తం 1,46,750 మంది విద్యార్థులు హాజరుకాగా.. 63,548 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 1,33,591కిగాను 56,836 మంది, ఒకేషనల్ విద్యార్థులు 13,159కిగాను 6712 మంది ఉత్తీర్ణులయ్యారు.
➥ ఇక ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసినవారిలో మొత్తం 78 శాతం విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు. పరీక్షలకు మొత్తం 2,10,820 మంది విద్యార్థులు హాజరుకాగా.. 1,64,716 మంది విద్యార్థుల మార్కులు పెరిగాయి. ఇందులో జనరల్ విద్యార్థులు 1,63,101 మంది ఉండగా.. 1615 ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
➥ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ బాలికలే ఆధిపత్యం చెలాయించారు. పరీక్షలకు 66,881 మంది బాలికలు హాజరైతే 31,048 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక బాలురు 79,869 మంది పరీక్షకు హాజరైతే.. 32,500 మంది (41 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
➥ ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు, సప్లిమెంటరీ పరీక్షలు కలిపిచూస్తే.. జనరల్ విభాగంలో 80 శాతం, ఒకేషనల్ విభాగంలో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 4,61,273 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3,67,711 మంది (80 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో 38,483 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 29,893 మంది (78 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రీవెరిఫికేషన్‌కు అవకాశం..
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలపై ఏమైనా సందేహాలుంటే రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. విద్యార్థులు జూన్ 28 నుంచి జులై 4 వరకు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను జూన్ 18న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరు కాగా... 74,868 మంది (59 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఇంటర్ సెకండియర సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకాగా... జూన్ 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.