AP Inter Exam: ఏపీలో ఇంటర్మీడియట్ 'ఎన్విరాన్‌మెంటల్' పరీక్ష వాయిదా, కొత్త తేదీ ఇదే
ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 3న నిర్వహించే పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ఫిబ్రవరి 1న ప్రకటించారు.
Inter Environmental Exam: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిబ్రవరి 3న నిర్వహించే పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ఫిబ్రవరి 1న ప్రకటించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఫిబ్రవరి 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉండగా.. ఫిబ్రవరి 3న నిర్వహించాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదాపడింది. అదేవిధంగా సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 3న ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలనే ఉద్దేశంతో పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 5 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు..
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్ సాధారణ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా వృత్తి విద్య కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.
ఏ రోజుకారోజే ప్రాక్టికల్ మార్కుల నమోదు..
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల మార్కుల నమోదులో ఇంటర్ విద్యామండలి.. కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రాక్టికల్ పరీక్ష ముగిసిన వెంటనే ఏ రోజు మార్కులను ఆ రోజే ఎగ్జామినర్.. కంప్యూటర్‌లో నమోదు చేయాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ ఏడాది దీన్ని అమలు చేయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు హాజరైన ఎగ్జామినర్ ఫోన్‌కు ఇంటర్ విద్యామండలి ఓటీపీని పంపిస్తుంది. దాని ఆధారంగా కళాశాలలోని కంప్యూటర్ ద్వారా వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో కొనసాగాలని మండలి ఆదేశించింది. మాన్యువల్‌గా మార్కులు నమోదు చేయకూడదని పేర్కొంది.
మార్చి 1 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు..
ఏపీలో ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.