AP EAPCET Counselling: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
APEAPCET 2024 Counselling: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. జులై 1 నుంచి వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.
APEAPCET 2024 Web Counselling Schedule: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఈ మేరకు జూన్ 29న ఏపీఎప్‌సెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎప్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు జులై 1 నుంచి 7 వరకు ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి జులై 4 నుంచి 10 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అభ్యర్థులు కౌన్సెలింగ్ ఫీజు కింద రూ1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 8 నుంచి 12 వరకు కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత జులై 13న వెబ్‌ఆప్షన్ల మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆపన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు జులై 16న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 17 నుంచి 22 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ స్ట్రీమ్) విభాగాలకు సంబంధించి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వెలువడనుంది.
ఏపీ ఈఏపీసెట్- 2024 ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు:
➥ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బీటెక్(డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
➥ బీఎస్సీ(అగ్రికల్చర్), బీఎస్సీ(హార్టికల్చర్), బీవీఎస్సీ & హెచ్, బీఎఫ్‌ఎస్సీ
➥ బీఫార్మసీ, ఫార్మా-డి.
➥ బీఎస్సీ (నర్సింగ్).
కౌన్సెలింగ్ షెడ్యూలు..
➥ ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 01.07.2024 - 07.07.2024.
➥సర్టిఫికేట్ వెరిఫికేషన్: 04.07.2024 -10.07.2024.
➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 08.07.2024 - 12.07.2024.
➥ వెబ్‌ఆప్షన్ల మార్పు: 13.07.2024.
➥ సీట్ల కేటాయింపు: 16.07.2024.
➥ సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్, రిపోర్టింగ్: 17.07.2024 to 22.07.2024.
➥ తరగతులు ప్రారంభం: 19.07.2024.
కౌన్సెలింగ్ సమయంలో అవసరమైన సర్టిఫికేట్లు..
వెబ్‌కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినటల్ సర్టిఫికేట్లతోపాటు రెండు జతల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఈ సర్టిఫికేట్లు అవసరం..
1) APEAPCET-2024 ర్యాంకు కార్డు
2) APEAPCET-2024 హాల్‌టికెట్
3) ఇంటర్ లేదా తత్సమాన మార్కుల మెమో
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో
5) ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)
6) 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు
7) ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్
8) రెసిడెన్స్ సర్టిఫికేట్
ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు మొత్తం 3.62 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3.39 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 2,65,444 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 1,95,092 మంది అర్హత సాధించారు. మొత్తం 75.51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక అగ్రికల్చర్ విభాగంలో మొత్తం 70,352 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణలైన విద్యార్థుల సంఖ్య 87.11 శాతంగా ఉంది.
ఈ ఏడాది ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించిన సంగతి తెలిసిందే. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా.. ఇందులో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ'ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి మే 25న వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇక మే 24న ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. జూన్ 11న ఫలితాలను వెల్లడించారు. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు.