EAMCET Counsellimg: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు టాప్ 200 ర్యాంకర్స్ డుమ్మా, కారణాలివే?
ఎంసెట్ తొలి 200 మంది ర్యాంకర్లలో ఒక్కరు కూడా ధ్రువపత్రాల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ విషయం స్పష్టమైంది.
ఎంసెట్ తొలి 200 మంది ర్యాంకర్లలో ఒక్కరు కూడా ధ్రువపత్రాల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా వెయ్యిలోపు ర్యాంకర్లలో అత్యధికులు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు సుముఖంగా లేరు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరైన వారి వివరాలు పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
ఎంసెట్ తొలివిడత సర్టిఫికేట్ల పరిశీలన జులై 9తో ముగిసింది. టీఎస్ ఎంసెట్ ఇంజినీరింగ్ ర్యాంకర్లల్లో 1 నుంచి 200 లోపు ర్యాంకర్లలో ఒక్కరు కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు. 300 లోపు వివరాలు తీసుకొంటే ఒక్కరే కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 400 లోపు ర్యాంకర్లలో కేవలం ముగ్గురు, 500 లోపు 14 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. వెయ్యిలోపు ర్యాంకర్ల వివరాలను పరిశీలిస్తే 104 మాత్రమే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సుకతను ప్రదర్శించారు.
మొత్తం 81,856 మంది అభ్యర్థులు కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల కోసం సిద్ధమయ్యారు. వారిలో ఎందరు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటారో జులై 12 నాటికి తేలుతుంది. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించి జులై 9 నాటికి 66,215 మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అగ్ర, ఉత్తమ ర్యాంకర్లు జాతీయస్థాయి విద్యాసంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపుతుండగా.. మిగిలిన వారిలో చాలామంది విద్యార్థులు టాప్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద బీటెక్ కంప్యూటర్ సైన్స్ సీటు రాదని అంచనాకు వచ్చి.. యాజమాన్య కోటాలో సీట్లు ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల గైర్హాజరుకు కారణాలివే..
* ఎంసెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్‌కు హాజరైన విద్యార్థుల్లో అత్యధికులు జేఈఈ ఎగ్జామ్‌కు హాజరవుతారు. సహజంగా ప్రతిభావంతులు కావడంతో వీరంతా ఎంసెట్‌యే కాకుండా జేఈఈలోనూ మంచి ర్యాంకులే సాధిస్తారు. అయితే వెయ్యిలోపు ర్యాంకర్లలోఎవరిని కదిలించినా ఐఐటీలు, ఎన్‌ఐటీలకు మొదటిప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీలను ఎంచుకొంటారు. ఈ తంతు కారణంగానే టాపర్లు మన రాష్ట్రంలో చేరడంలేదని, కౌన్సిలింగ్‌కు హాజరుకావడంలేదని అధికారులు పేర్కొంటున్నాయి.
* ఈ సారి ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విషయంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జోసా కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. గతంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ముందుగా జరగడంతో వీరంతా తొలుత రాష్ట్రంలో ప్రవేశాలు పొంది, తర్వాత ఐఐటీల్లో చేరేవారు. కానిప్పుడు ముందుగానే ఐఐటీల్లో చేరడంతో రాష్ట్రంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయారు. దీంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
యాజమాన్యాల అక్రమాలకు చెక్..
అత్యుత్తమ ర్యాంకర్లు ముందుగానే ఐఐటీల్లో ప్రవేశాలు పొందడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ యాజమాన్యాలు స్పాట్ సెలెక్షన్ పేరుతో నిర్వహించే అక్రమాలకు తెరపడినట్టయింది. గతంలో ఎంసెట్ టాపర్లు రాష్ట్రంలో చేరినా.. వారు సీట్లు వదులుకొనేవారు. అయితే, కాలేజీల యాజమాన్యాలు సీట్లు వదులుకున్న విషయాన్ని చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచి ఆయా సీట్లను స్పాట్ సెలెక్షన్ సమయంలో ఖాళీగా ఉన్నట్టుగా చూపించి విక్రయించేవి. తాజాగా ప్రతిభావంతులు కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోవడంతో, నిండినట్టుగా చూపించుకొనే అవకాశం లేకపోగా, స్పాట్ అక్రమాలకు అడ్డుకట్టపడినట్టయింది.
కన్వీనర్ కోటాలో 76వేల సీట్లు..
ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా.. కన్వీనర్ కోటా కింద 76,359 ఉన్నాయి. తొలుత వీటి సంఖ్య 62 వేలు మాత్రమే ఉండేది. ఇటీవలే సీట్ల పెంపు, కొత్త కోర్సుల అనుమతి ఇవ్వగా, వీటి సంఖ్య పెరిగింది. కాలేజీలు తీసుకొంటే 16 యూనివర్సిటీ కాలేజీలు, 2 ప్రైవేట్ యూనివర్సిటీలు, 155 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటా కలిపి మొత్తం సీట్లు 1,07,039 ఉన్నాయి. ఇందులో 51,605 సీట్లు సీఎస్‌ఈ, ఐటీ, సంబంధిత బ్రాంచీల్లోనివే. వీటిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ) సీట్లు 21,503 ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial