Tamil Nadu: వాననీటిలో చిక్కుకున్న కారు.. వైద్యురాలి మృతి.. తమిళనాడులో దారుణం..
Crime News: వర్షపు నీటిలో చిక్కుకుని ఓ ప్రభుత్వ వైద్యురాలు దిక్కు తోచని స్థితిలో మరణించిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరద నీటికి ఓ నిండు ప్రాణం బలైంది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వర్షపు నీటిలో కారు చిక్కుకుని వైద్యురాలు మరణించిన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుక్కోట జిల్లా తురైయూర్ పరిధికి చెందిన శివకుమార్, సత్య (35) దంపతులు. సత్య కృష్ణగిరి జిల్లా హోసూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంది. శుక్రవారం సాయంత్రం ఆమె తన అత్తగారితో కలిసి కారులో తురైయూర్‌కు బయలుదేరింది. కారు తురైయూర్ సమీపంలోకి చేరుకోగానే భారీ వర్షం ప్రారంభమైంది. దీంతో అక్కడున్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షం నీళ్లు భారీగా చేరాయి. ఆ మార్గంలోనే వెళ్తున్న వీరి కారు.. వరద నీటిలో చిక్కుకుపోయింది.
ముందుకు వెనుకకు వెళ్లలేని స్థితిలో కారు అక్కడే నిలిచిపోయింది. కారు వెనుక భాగంలో కూర్చున్న సత్య అత్తగారు సురక్షితంగా బయటకు రాగలిగారు. కానీ డ్రైవింగ్ సీటులో ఉన్న సత్య సీటు బెల్ట్ లాక్ అవడంతో బయటకు రాలేక కారులోనే ఉండిపోయింది. సహాయం కోసం సంధ్య అత్త గట్టిగా కేకలు వేయడంతో కొంతమంది వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే వరద నీరు భారీగా చేరడంతో సత్య చాలా సేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరకు ప్రాణాలు కన్ను మూసింది. దీంతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సత్య చనిపోయిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలుస్తుందని పలు మార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని అంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
సమాచారం అందుకున్న వెల్లనూరు, కీరనూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును తెరిచి సంధ్య మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పుదుక్కోటై వైద్య కాలేజీకి పంపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన రైల్వే అండర్ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.