Paraglide Crash: పారాగ్లైడ్ క్రాష్ కావడంతో విషాదం, ఓ మహిళతో సహా ఇన్స్ట్రక్టర్ సైతం మృతి
పారాగ్లైడ్ లోయలో కుప్పకూలి ఓ మహిళతోపాటు ఇన్స్ట్రక్టర్ మృతిచెందారు. ఈ ఘటన నార్త్ గోవాలో జరిగింది.

Paraglide Crash: చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ సంస్థ పారాగ్లైడ్ లోయలో కుప్పకూలి ఓ మహిళతోపాటు ఇన్స్ట్రక్టర్ మృతిచెందారు. ఈ ఘటన నార్త్ గోవాలో శనివారం జరిగింది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన శివాని డబ్లే (27) పారాగ్లైడింగ్ చేయాలనుకుంది. నార్త్ గోవాలో చట్టవిరుద్ధంగా ఓ పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్న ఓ అడ్వెంచర్ సంస్థను సంప్రదించింది. దీంతో వారు ఆ మహిళకు నేపాల్కు చెందిన ఇన్స్ట్రక్టర్ సుమన్ నేపాలి (26)తో పారాగ్లైడింగ్ చేయించారు.
కేబుల్ తెగిపోవడంతో..!
ఆ ఇద్దరు కలిసి గ్లైడర్లో పైకి ఎగిరిన కొద్దిసేపటికే ఓ లోయలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివాని, ఇన్స్ట్రక్టర్ స్పాట్లోనే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. గ్లైడర్లోని ఓ కేబుల్ తెగిపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు.
యజమానిపై హత్య కేసు నమోదు
మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాంద్రెమ్ పోలీసులు తెలిపారు. చట్టవిరుద్ధంగా పారాగ్లైడింగ్ నిర్వహిస్తున్న అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ యజమానిపై సెక్షన్ 105 కింద నేరపూరిత హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పటిష్ఠ చర్యలు తీసుకోకుండానే పారాగ్లైడింగ్ చేయిస్తున్నారని, ఇలాంటి చర్యలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ యజమాని శేఖర్ రైజాదాకు పూర్తిగా తెలుసన్నారు. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే పారాగ్లైడింగ్ చేయిస్తున్నారని పేర్కొన్నారు.





















