Siddiet News: ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్న భర్త - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య, ఎక్కడంటే.?
Telangana Crime News: సిద్దిపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్న భర్తను ఓ మహిళ సుపారీ ఇచ్చి హత్య చేయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Wife Killed Her Harassing Husband in Siddipet: సిద్దిపేటలో (Siddipet) షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త ట్రాన్స్ జెండర్ లా మారి వేధిస్తున్నాడని అడ్డు తొలగించుకుంది. సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. గత నెలలో ఈ ఘటన జరగ్గా, కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా బోయిగల్లీకి చెందిన వేదశ్రీ అనే మహిళకు నాసర్ పురా వీధికి చెందిన దరిపల్లి వెంకటేశ్ (33)తో 2014లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. ఆ తర్వాత నుంచి వెంకటేశ్ తన భార్యను కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అనంతరం కొద్ది రోజుల తర్వాత వెంకటేశ్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని భార్య గమనించింది. చెవులకు కమ్మలు, ముక్కుపుడక పెట్టుకుని రాత్రిళ్లు ఆడవారి దుస్తులు ధరించడాన్ని గుర్తించింది. 2019లో ట్రాన్స్ జెండర్ లా మారిన అతను తన పేరు కూడా రోగా మార్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేదశ్రీ గత ఏడేళ్లుగా అతనికి దూరంగా ఉంటోంది. అయితే, కుమార్తెను తనకు అప్పగించాలంటూ భార్యను వేధించేవాడు. ఆమె పని చేసే పాఠశాల వద్దకు వెళ్లి గొడవ చేయగా వేదశ్రీ ఉద్యోగం కోల్పోయింది. మరో పాఠశాలలో చేరినా ఇలాగే వేధింపులు కొనసాగాయి.
సుపారీ ఇచ్చి హత్య
దీంతో విసిగిపోయిన వేదశ్రీ.. వెంకటేశ్ అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఈ క్రమంలో సిద్దిపేటకు చెందిన బోయిని రమేష్ తో కొంతకాలంగా సన్నిహితంగా ఉన్న వేదశ్రీ.. అతనితో కలిసి వెంకటేశ్ (రోజా)ను హత్య చేయించాలని నిర్ణయించింది. 2023లో సెప్టెంబర్ లో రూ.18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని రెండు విడతల్లో రూ.4.60 లక్షలు చెల్లించింది. రమేష్ మిత్రుడైన, నుంగనూరు మండలం నాగరాజుపల్లికి చెందిన ఇప్పల శేఖర్ కు ఈ విషయం చెప్పారు. పథకంలో భాగంగా వెంకటేశ్ (రోజా)తో శేఖర్ పరిచయం పెంచుకుని తరచూ కలుస్తుండేవాడు. ఈ నేపథ్యంలో శేఖర్, వెంకటేశ్ (రోజా)ను వరంగల్ నుంచి సిద్దిపేట పిలిపించాడు. గతేడాది డిసెంబర్ 11న నాసర్ పురా ఇంట్లోనే ఒంటరిగా ఉన్న వెంకటేశ్ (రోజా)ను కలిసిన శేఖర్ ఫుల్లుగా మద్యం తాగించి, మరో ఇద్దరి సాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
అనుమానాస్పద మృతిగా
అప్పట్లో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్దారణ కావడంతో పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి ఆ కోణంలో దర్యాప్తు చేసి అసలు నిజాలు వెలికితీశారు. ప్రధాన నిందితురాలు వేదశ్రీతో పాటు రమేశ్, శేఖర్ లను శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. హత్యలో మొత్తం ఆరుగురి పాత్ర ఉందని, పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Hyderabad News: భార్యతో కలిసి కన్నతల్లిని హత్య చేసిన కొడుకు! దిండు అదిమి, గొంతు పిసికి ఊపిరాడకుండా