Warangal News : విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ, చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
Warangal News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
Warangal News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి తాటికంటి రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం దశ దిన కర్మ నిర్వహిస్తుండగా.. మొగుళ్లపల్లి గ్రామానికి గుండాల సురేశ్-భాగ్యలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు వర్షిత్ (7), కమలాపురం మండలం గుండెడు గ్రామానికి కోటేశ్వర్రావు, రాణి దంపతులు కుమారుడి(11) తో కలిసి వచ్చారు. మృతుడు రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న కుంట వద్దకు వీరి పిల్లలు బహిర్భూమికి వెళ్లగా కుంటలో ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. ఈత రాకపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీయించారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే ట్రాక్ పై విద్యార్థి మృతదేహం
విశాఖపట్నం జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మర్రిపాలెం రైల్వే స్టేషన్ సమీపంలో ఓయువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖకు చెందిన పవన్ అనే యువకుడు దాకరమర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజూలాగే కళాశాలకు వెళ్లిన పవన్ తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు చాలా చోట్ల వెతికారు. ఇదే క్రమంలో పవన్ మృతదేహం మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో దొరికింది. విషయం గుర్తించిన జీఆర్పీ పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతుడి వద్ద కళాశాలకు చెందిన బ్యాగు ఉండడంతో అతడి వివరాలను గుర్తించగలిగారు. అలాగే పవన్ తల వెనుక భాగంలో ఆరంగులాల గాయం ఉందని, ముఖం, ఎడమ భూజంపైన తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. పవన్ ఫోన్ ను తీసుకొని చూడగా.. అతని తల్లిదండ్రులకు పంపించిన మెసేజ్ కనిపించింది. దాన్ని చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్న అర్థం అవుతుంది.
వీఆర్వో ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఓ వీఆర్వో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమగ్ర భూసర్వే పేరుతో తనను అధికారులు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశారు. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. డిల్లాలోని జి.సిగడాం మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన తనికెళ్ళ సంతోష్ అదే గ్రామ వీఆర్వోగా పని చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా సమగ్ర భూ సర్వే పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రతిరోజూ సర్వేలు పూర్తి చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. కానీ గ్రామంలోని పలువురి భూములు సరైన సర్వే నెంబర్లు లేకపోవడం, గొడవలు జరుగుతుండడంతో పనులు ఆగిపోయాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలని పైఅధికారులను ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. కానీ వెంటనే పనులు పూర్తి చేయాలని మాత్రం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇది తట్టుకోలేని సంతోష్ ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగేశాడు. కానీ కాసేపటికే కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వీఆర్వో సంతోష్ చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.