Warangal News: ప్రీతి ఘటన మరవకముందే మరో విద్యార్థిని బలి! వెంటనే వరంగల్‌లో ఇంకో దారుణం
Warangal Crime News: ఆమెకు తెలిసిన ఓ అబ్బాయి గత కొంత కాలంగా వేధిస్తున్నాడు. ఫొటోలు నెట్టింట పెడతానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బీటెక్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
Warangal Crime News: ఆ అబ్బాయి.. ఆ అమ్మాయికి పదో తరగతి నుంచే తెలుసు. ప్రస్తుతం ఆమె బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. అయితే కొంత కాలంగా సదరు యువకుడు.. అమ్మాయిని వేధిస్తున్నాడు. తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను నెట్టింట పెట్టి పరువు తీస్తానంటున్నాడు. అతడి ప్రవర్తనతో విసిగి వేసారిని యువతి.. తల్లిదండ్రులకు చెప్పింది. ఆపై వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాయికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. అది తట్టుకోలేని అమ్మాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పబ్బోజు శంకర్, రమాదేవి దంపతులకు 20 ఏళ్ల రక్షిత అనే కుమార్తె ఉంది. అయితే ఆమె నర్సంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది. స్వగ్రామంలో పదో తరగతి చదివే రోజుల్లో ఆమెకు పరిచయం అయిన రాహుల్ కొంత కాలంగా ఆమెను వేధఇస్తున్నాడు. ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. విషయాన్ని రక్షిత తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వాళ్లు భూపాల పల్లి పోలీసులను ఆశ్రయించారు. దీంతో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో మార్పు రాలేదు. శివరాత్రికి భూపాలపల్లికి వెళ్లిన రక్షిత కళాశాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఇంటి నుంచి బయలు దేరింది. కానీ కళాశాలకు చేరుకోలేదు. దీంతో తమ కూతురు కనిపించడం లేదని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత రెండు రోజులకు రక్షిత తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. హాస్టల్ లో ఉండే ఇబ్బంది అవుతుందంటూ వరంగల్ రామన్నపేటలోని తన సోదరుడి ఇంటికి తండ్రి శంకర్ పంపించాడు. మిస్సింగ్ కేసు విషయంలో సోమవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉండగా.... ఆదివారం రక్షిత తన బాబాయి ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయింది. తండ్రి కాంట్రాక్ట్ పని మీద ఘూర్థండ్ వెళ్లారు. రాహుల్ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సీనియర్ వేధింపులు తాళలేక మెడికో విద్యార్థి ఆత్మహత్య
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి పోరాటం ముగిసింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించారు. ఆదివారం రాత్రి 9:10 గంటలకు ప్రీతి చనిపోయిందని వైద్యులు ప్రకటన చేశారు. 5 రోజులపాటు మృత్యువుతో పోరాడిన మెడికో ప్రీతిని బతికించేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ మెడిసిన్ స్టూడెంట్ ప్రీతి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
కేఎంసీ ( కాకతీయ మెడికల్ కాలేజీ)లో సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిబ్రవరి 22న ఆత్మహత్యాయత్నం చేసింది. చనిపోదామని హానికర ఇంజెక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని గుర్తించి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 5 రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు రాలేదు, వైద్యానికి ప్రీతి అవయవాలు స్పందించడం లేదని, ఆరోగ్యం మెరుగు అవుతున్న సూచనలు కనిపించడం లేదని మొదట్నుంచీ డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే ప్రీతి ఆదివారం రాత్రి చనిపోయింది. ఆమె మరణంపై నిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.