Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో విషాదం, తాటి ముంజుల కోసం ఆగితే దూసుకొచ్చిన మృత్యువు, ముగ్గురు మృతి
Vizianagaram Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాటి ముంజుల కోసం రోడ్డు పక్కన ఆగిన బైక్ లపైకి కారు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి చెందారు.
Vizianagaram Accident : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఆగిన రెండు ద్విచక్రవాహనాలను అతి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఎస్.కోటకు ఉంటున్న కిల్లో సోనాపతి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై స్వగ్రామం అనంతపురంలోని కోనాపురం బయలుదేరారు. మార్గమధ్యలో గౌరీపురం దగ్గర రోడ్డు పక్కన తాటి ముంజలు కొనేందుకు బైక్ ఆపారు. అదే సమయంలో అరకు వైపు నుంచి వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైకులపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సోనాపతి, ఆయన భార్య శ్రావణి తీవ్రంగా గాయపడ్డారు. వారి పిల్లలు శ్రావణ్(6), సువాస్(3) అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న బైక్ పై ఉన్న పెద్దకండేపల్లికి చెందిన అప్పారావు, అతని తమ్ముడు, కూతురు ఐదేళ్ల సుచిత కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని శృంగవరపు కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని విశాఖకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనాపతి మృతి చెందారు. ఎస్.కోట ఎస్సై తారకేశ్వరరావు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లైట్ లేని బైక్ ముగ్గురి ప్రాణాలు తీసింది
రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పుకు మరొకరు బలి అవుతుంటారు. ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి వేళ లైట్ లేని బైక్ తో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి ముగ్గురు ప్రాణాలు బలితీసుకున్నాడు. బైక్‌పై శివ, బహదూర్, ఆశిష్ అనే ముగ్గురు యువకులు పటాన్‌చెరు నుంచి పటేల్‌గూడెం వెళ్తున్నారు. అమీన్‌పూర్ వద్దకు వచ్చే సరికి సడన్ గా ఎదురుగా వచ్చిన బైక్ ను వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలైన ఆశిష్ చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా వాళ్లూ అక్కడ మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనానికి లైట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అజిత్, శివ ముర్ర అనే యువకులు లైట్ లేని బైక్‌పై పటాన్‌చెరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హన్మకొండలో రోడ్డు ప్రమాదం
శాయంపేటలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ, ఓ ఆటో (టాటా ఏస్ వాహనం)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట శివారులోని కస్తూర్బా పాఠశాల సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పత్తిపాక గ్రామానికి చెందిన కూలీలు ప్రతిరోజులాగే కూలీ పని కోసం టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. మొగుళ్లపల్లి మండలంలో మిరప తోటలో కాయలు ఏరడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో వీరి వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా, మరో 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.