Vizag KGH: కేజీహెచ్‌లో పసిబిడ్డ కిడ్నాప్, వివరణ ఇవ్వని సూపరిండెంట్ - నోరు విప్పని పోలీసులు!
KGH: పాపను పరీక్షల కోసం తీసుకెళ్తామని ఓ మహిళ పాప అమ్మమ్మ చేతి నుండి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత పాప అపహరణకు గురి అయినట్లుగా అమ్మమ్మ గుర్తించింది.
ఉత్తరాంధ్ర ఆరోగ్య దేవాలయంగా పిలిచే వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుండి 5 రోజుల పసికందు అపహరణకు గురిఅయింది. విశాఖ జిల్లా పద్మనాభం మండలం రౌతుల పాలెం గ్రామానికి చెందిన అప్పాయమ్మ అనే మహిళ కాన్పు కోసం కేజీహెచ్ హాస్పిటల్ లో ఈ నెల 11 న చేరింది. అదే రోజు ఒక ఆడ శిశువుకు జన్మ ఇచ్చింది. బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పాపను పరీక్షల కోసం తీసుకెళ్తామని ఒక మహిళ పాప అమ్మమ్మ చేతినుండి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత పాప అపహరణకు గురి అయినట్లుగా అమ్మమ్మ గుర్తించింది. కేకలు వేయడంతో హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
సీసీటీవీలో రికార్డయిన ఇద్దరు మహిళలు
హాస్పిటల్ కు చేరిన ఏసీపీ శిరీష ఇతర పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా చీర కట్టుకున్న ఒక మహిళ, చుడీదార్ వేసుకున్న మరో మహిళ పాపతో ఒక ఆటోలో గురుద్వారా వరకూ వెళ్లినట్టు గమనించారు. ఆటో డ్రైవర్ ను ట్రేస్ చేసి ప్రశ్నించగా పెద్దగా వివరాలు తెలియరాలేదని సమాచారం. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే దీనిపై మీడియాతో స్పందించడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మైథిలి గానీ, ఏసీపీ శిరీష గానీ సుముఖత చూపడం లేదు. మరోవైవు పోలీసులు పసికందు జాడ కోసం విశాఖ నగరమంతా జల్లెడ పడుతున్నారు. పాప బంధువులు కేజీహెచ్ ఆవరణలో ఆందోళనకు దిగారు.