India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...
విశాఖలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భారత్-పాక్ మ్యాచ్ పై ఆన్లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. మిగిలిన బుకీల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
విశాఖలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. నగరంలోని మాధవధారలో ఓ అపార్ట్ మెంట్ లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తిని విశాఖ ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్, 2 సెల్‌ఫోన్లు, 2 చెక్‌బుక్‌లు, 2 ఏటీఎం కార్డులతో పాటు రూ.88 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ వెనుక మరికొంత మంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు మిగిలిన బుకీలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!
తిరుపతిలో పోలీసుల తనిఖీలు
భారత్ - పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ జరుగుతుందన్న అనుమానంతో తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసి సొమ్ము చేసుకోవాలని చూస్తే సహించేది లేదని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు స్పష్టం చేశారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లను ఆసరాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఎంతోమంది అమాయకులను మోసం చేస్తున్నారన్నారు. తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బెట్టింగ్ పై నిఘా పెట్టామని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ ను నిర్మూలించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు.
Also Read: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు
బెట్టింగ్ ఉచ్చులో పడకండి
యువకుల క్రికెట్ బలహీనతను ఆసరాగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి బెట్టింగ్ లకు పాల్పడిన, నిర్వహించిన ఎంతటివారినైనా ఉపేక్షించబోమని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు తెలిపారు. అటువంటి వారిపై ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు సస్పెక్ట్ సీట్లు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఊరికే వచ్చే నగదు వెనుక అనేక నష్టాలు ఉన్నాయని యువత బెట్టింగ్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర ఆర్భాటాలకు వెళ్లి తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేయవద్దన్నారు. యువత అనవసరంగా కేసుల్లో ఇరుక్కొని జీవితాలను దుర్భరం చేసుకోవద్దని అలాగే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాలని చూస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎస్పీ వెంకట అప్పల నాయుడు హెచ్చరించారు.
Also Read: ఫీల్డింగ్ కోచ్ పదవులకు దరఖాస్తు చేసిన మాజీ క్రికెటర్లు.. ఎవరో తెలుసా?