(Source: ECI/ABP News/ABP Majha)
Visakha Drugs: హైదరాబాద్ పబ్ లో మొదలైన స్నేహం డ్రగ్స్ మత్తులో దించింది... విశాఖ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో హైదరాబాద్ కు లింక్ ఉంది. హైదరాబాద్ లోని పబ్ లో కుదిరిన స్నేహం డ్రగ్స్ వినియోగానికి దారితీసింది. విశాఖ డ్రగ్స్ కేసులో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చిన ఓ అమ్మాయి దగ్గర డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ కేసు వివరాలను విశాఖ వెస్ట్ ఎసీపీ శ్రీపాదరావు మీడియాకు వెల్లడించారు.
విశాఖ ఎన్ఏడీ వంతెన దగ్గర డ్రగ్స్ కలిగి ఉన్న యువతి, యువకుడుతో పాటు రాజాం పట్టణానికి చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన గీత, గంటా మాలవ్య, విశాఖకు చెందిన హేమంత్, రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు. వీరంతా గోవా వెళ్లినప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు. విశాఖకు చెందిన హేమంత్ డగ్స్ కావాలని పృథ్వీ అకౌంట్ నుంచి రూ.33 వేలు ఫోన్ పే ద్వారా గీతకు పంపాడు. గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది. మాలవ్య హైదరాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుంది. గీత, మాలవ్యతో హేమంత్ కు డ్రగ్స్ పంపించింది. 29వ తేదీన డ్రగ్స్ తో హైదరాబాద్ నుంచి మాలవ్య ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరి 30న విశాఖకు వచ్చింది.
హైదరాబాద్ పబ్ లో
విశాఖ సిటీ టాస్క్ పోర్స్ పోలీసులకు అందిన సమాచారంతో ఎన్ఏడీ జంక్షన్ వద్ద నిఘా పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మాలవ్యను తీసుకెళ్లేందుకు హేమంత్ ఆడి కారులో వచ్చాడు. ఇద్దరు కలిసి కారు ఎక్కిన తర్వాత మాలవ్య హేమంత్ కు డ్రగ్స్ ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో హేమంత్, మాలవ్య, డాక్టర్ పృథ్వీని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 18 ఎంఎండీఏ పిల్స్, 2 ఎంఎండిఏ క్రిస్టల్ ఫౌడర్, నాలుగు సెల్ ఫోన్లు, రూ.20,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరందరు హైదరాబాద్ లో పబ్ లకు వెళ్లినప్పుడు ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడింది. హైదరాబాద్, బెంగళూరు, గోవా నుంచి వీరు డ్రగ్స్ కోనుగోలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుత విచారణలో డ్రగ్స్ వినియోగించుకోవడానికే వీటిని తీసుకొచ్చినట్లు తెలిసిందన్నారు. డ్రగ్స్ ఒక్కో పిల్ రూ.1500కు కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.
ప్రియుడి కోసం డ్రగ్స్
విశాఖపట్నంలోని మర్రిపాలెం గ్రీన్ గార్జెన్స్‌కు చెందిన యువకుడు, హైదరాబాద్‌కు చెందిన యువతికి కొంతకాలంగా పరిచయం ఉంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి యువతి డ్రగ్స్‌తో వస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఎన్‌ఏడీ వద్ద నిఘా పెట్టారు. ఎన్‌ఏడీ దగ్గర వాహనం దిగిన యువతిని విశాఖ యువకుడు కలిసి.. ఆమె దగ్గర ఉన్న డ్రగ్స్ ట్యాబెట్లను తీసుకున్నాడు. ఇదంతా దూరం నుంచి గమనించిన పోలీసులు వారిపై దాడిచేసి ఇద్దరిని పట్టుకున్నారు. వీరి నుంచి మొత్తం 18 ట్యాబెట్లను, ఒక కారుని స్వాధీనం చేసుకున్నారు. యువతి, యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ప్రియుడి కోసం యువతి డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తీసుకొచ్చిన్నట్లుగా అనుమానిస్తున్నారు.