Visakha Crime: భీమిలి హైగ్రీవ్ రిసార్ట్స్ లో హై ప్రొఫైల్స్ పేకాట... కాయిన్స్ తో గేమ్స్... 24 మంది అరెస్టు..!
విశాఖ నగరానికి అతి చేరువలో పేకాట డెన్ నిర్వహిస్తున్నట్లు సమాచారంలో సెబ్, ఎక్సైజ్, పోలీసులు దాడులు చేశారు. భీమిలి మండలంలోని హైగ్రీవ్ రిసార్ట్స్ పై దాడులు చేసి పేకాట ఆడుతున్న 24 మందిని అరెస్టు చేశారు.
విశాఖలో శనివారం అర్ధ రాత్రి భారీ పేకాట శిబిరంపై స్పెషల్ ఇన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. భీమిలి మండలం అన్నవరం గ్రామం సమీపంలో గల హైగ్రీవ్ రిసార్ట్స్ లో గుట్టు చప్పుడు కాకుండా భారీ పేకాట శిబిరాన్ని నడుపుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెబ్ పోలీసులు పేకాట డెన్ పై దాడులు చేసి చాకచక్యంగా నిందితులను పట్టుకున్నారు. ఈ దాడుల్లో రూ.5.70 లక్షల నగదు, 8 కార్లు , 23 సెల్ ఫోన్లతో పాటు 24 మంది జూదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను భీమిలి పోలీసులకు అప్పగించారు సెబ్ అధికారులు. నిర్వాహకులు తెలివిగా నగదుతో పాటు కాయిన్స్ కూడా వాడుకలో ఉంచిన విషయాన్ని సెబ్ అధికారులు గుర్తించారు. పది వేల రూపాయల కాయిన్స్ 123, ఐదు వేల రూపాయల కాయిన్స్ 179, రెండు వేల రూపాయల కాయిన్స్ 9, వెయ్యి రూపాయల కాయిన్స్ 10, మొత్తం 321 కాయిన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైగ్రీవ్ రిసార్ట్స్ యజమాని అరెస్టు
విశాఖ నగర పరిధిలోని భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని హైగ్రీవ్ రిసార్ట్స్ లో పేకాట కేసులో 24 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఈబీ, ఎక్సైజ్, పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. అరెస్టు అయిన వారిలో హైగ్రీవ్ రిసార్ట్ యజమాని జగదీశ్వరుడు, రిసార్ట్స్ మేనేజర్ కృష్ణకాంత్ ఉన్నారని వెల్లడించారు. మొత్తం 5,70,270 రూపాయల నగదు, 321 ప్లాస్టిక్ కాయింన్స్ , 8 కారులు, 23 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏపీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసును నమోదు చేశామని తెలిపారు. దాట్ల కృష్ణమరాజు, చేబ్రోలు శ్రీనివాసరావు అనే ఇద్దరు ఆర్గనైజర్లను గుర్తించామన్నారు. ఇక్కడ పేకాట ఆడేందుకు రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారని పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ కాయిన్స్ ను నగధు రూపంలో వాడుతున్నట్లుగా గుర్తించామన్నారు.
నగరానికి చెందిన ప్రముఖులు
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో విశాఖ సిటీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. పేకాటరాయుళ్లు నగదుకు బదులు కాయిన్స్ వాడుతున్నారని పోలీసులు చెప్పారు. మొత్తం డబ్బే వాడితే దొరికిపోతామన్న భయంతో కాయిన్స్ వినియోగించినట్లు తెలిపారు. ప్రముఖులకు సంబంధించి వివరాలు ఇంకా తెలియలేదని, దర్యాప్తు చేస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. మేజిస్ట్రేట్ వీళ్లను మందలించి జరిమానా కట్టమని వదిలేసే అవకాశం ఉందన్నారు. పేకాటతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
Also Read: విజయవాడలో బాలిక సూసైడ్ కలకలం... 2 నెలలుగా వేధిస్తున్న టీడీపీ నేత...!