Vijayawada Fire Accident: విజయవాడలో టీవీఎస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం - పూర్తిగా దగ్ధమైన 300 వాహనాలు
Vijayawada Fire Accident: విజయవడా బెంజ్ సర్కిల్ లోని ఓ టీవీఎస్ షోరూంలో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 300 వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
Vijayawada Fire Accident: విజయవాడ బెంజ్ సర్కిల్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున పట్టణంలోని కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూంతోపాటు గోదాములో ఉన్న 300 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు కూడా ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలను గోదాములలో ఉంచుతారు. అయితే వందల సంఖ్యలో వాహనాలు గోదాముల్లో ఉంచుతారు. ద్విచక్ర వాహనాల షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌లను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఒకే చోట గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్ కూడా ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఉన్నాయి. ఈక్రమంలోనే అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో వందలాది వాహనాలు ధ్వంసం అయ్యాయి.
గురువారం వేకువ జామున షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోగా.. ఉవ్వెత్తున మంటలు ఎగిసి పడ్డాయి. కాసేపట్లోనే మంటలు అటు గోదాముకు అంటుకున్నాయి. విషయం గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మూడు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. ప్రీ ఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అయితే గోదాములో సాధారణ వాహనాలతోపాటుగా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని వివరిస్తున్నారు. అలాగే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచడం, వాటిని ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
Read Also: TTD News: భక్తులు గుంపులుగా వెళ్లాలి, తిరుమల అడవిలో 40 చిరుతలు - సీసీఎఫ్
మొన్నటికి మొన్న రంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టాటానగర్‌లోని ఓ పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్లాంకెట్లకు మంటలు అంటుకుని మంటలు వేగంగా గోదాం మొత్తం వ్యాపించాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని చెప్పారు. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల పెద్ద ఎత్తున పొగలు అలముకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు దట్టంగా పొగలు అలముకోడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.