Vijayawada Electric Bike: విజయవాడలో విషాదం - కొన్న 24 గంటల్లోనే పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, ఒకరి మృతి
Electric Bike Battery Blast in Vijayawada NTR District: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టగా.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు చనిపోయిన ఘటన కలకలం రేపింది.
Vijayawada Electric Bike Blast: పెట్రోల్ ధరల సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఏదో చోట ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలడంతో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదివరకే మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలో పలుచోట్ల ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలడంతో ప్రాణ నష్టం కూడా సంభవించింది. తాజాగా విజయవాడలో ఛార్జింగ్ పెట్టగా.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన (Electric Bike Battery Blast In Vijayawada) ఘటన కలకలం రేపింది. బ్యాటరీ పేలడంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి కాలిన గాయాలయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కొన్న 24 గంటల్లోనే పేలడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే..
విజయవాడ సత్యనారాయణపురం గులాబీ తోటకు చెందిన శివకుమార్ శుక్రవారం కొత్త CORBETT14 ఎలక్ట్రిక్ బైక్‌ను కొనుగోలు చేశారు. ఎన్నో రోజులనుంచి అనుకున్న తమ కల నెరవేరిందని భావించారు. పెట్రోల్ ధరల మోత ఉండదని, తక్కువ ఖర్చుతో ఛార్జింగ్ పెట్టుకుని ఎంచక్కా తిరగవచ్చునని భావించిన కుటుంబం జరగబోయే విషాదాన్ని ఊహించలేదు. బైక్ బ్యాటరీకి ఇంటిలోని ఓ రూమ్‌లో ఉంచి రాత్రి చార్జింగ్ పెట్టాడు శివకుమార్. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకున్నా.. స్థానికులు అతికష్టమ్మీద శివకుమార్‌ను, ఆయన భార్య, ఇద్దరు పిల్లలను రక్షించి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి..
శివకుమార్ పరీక్షించిన వైద్యులు అతడు మార్గంమధ్యలోనే చనిపోయాడని (One Died After Electric Bike Battery Blast in Vijayawada) నిర్ధారించారు. శివకుమార్ భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి. అందులోనూ ఇంట్లో పొగ పీల్చడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శివకుమార్ భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యుల సలహా మేరకు వీరిని మెరుగైన వైద్యంకోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశామని ఆనందించేలోపే ఆ కుటంబానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనం ఆ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చిందని స్థానికులు చెబుతున్నారు.
Also Read: Prakasam: ఇంట్లోనే చితి పేర్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు! ఫ్యామిలీ షాకింగ్ నిర్ణయం - చివరికి
Also Read: Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !