Hyderabad Crime: లక్షకు లక్ష అంటే ఫ్లాటైపోయారు - 150 కోట్లు లాసైపోయారు - హైదరాబాద్‌లో భారీ ట్రేడింగ్ మోసం
Trading Cheating: హైదరాబాద్ లో ట్రేడింగ్ పేరుతో జరిగిన మోసంలో బాధితులు 150 కోట్లు నష్టపోయారు. తాము డబ్బులు కట్టిన కంపెనీ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్నారు.

THE PENGUIN Cheating:: స్టాక్ మార్కెట్లో డబ్బుల పంట పండుతోంది.. లక్ష పెడితే.. కొద్ది రోజుల్లోనే లక్ష వస్తాయి.. లక్షకు లక్ష అని ఓ కంపెనీ ఆశచూపడంతో అమాయకులు నిండా మునిగిపోయారు. నిజమేనని నమ్ముకుని ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుని సంపాదించుకున్న సొమ్ము, మరికాస్త అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు తమకు న్యాయం చేయాలని పోలీసుల వద్దకు పరుగులు పెడుతున్నారు.
పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో ఆఫీస్
మేడ్చల్ జిల్లాజీడిమెట్ల పియస్ పరిదిలోని చింతల్ లో కొద్ది రోజుల కిందట THE PENGUIN పేరుతో ఓ కంపెనీ ఏర్పాటయింది. తాము స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తామని .. ప్రచారం చేసుకుంది. తమ వద్ద పెట్టుబడి పెడితే లక్ష రూపాయలకు లక్ష లాభం ఇస్తామని చెప్పి 1500మంది కస్టమర్ల వద్ద 150 కోట్లు వసూలుచేశారు. ఇప్పుడు లక్షకు లక్షకాదు కదా..అసలు కూడా ఇవ్వకుండా పరారయ్యారు. మోసపోయామని గ్రహించి జీడిమెట్ల పియస్ కి భాదితులు క్యూ కట్టారు.
స్టాక్ మార్కెట్ లో బాగా డబ్బులు సంపాదించవచ్చని ప్రచారం
చింతల్, గణేష్‌నగర్‌లో 'ది పెంగ్విన్ సెక్యూరిటీస్' అనే పేరుతో కొందరు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కాస్త హైఫైగా ఏర్పాటు చేసిన సంస్థ గురించి అక్కడి స్థానికుల్లో గొప్పగా ప్రచారం చేయించుకున్నారు. స్టాక్ మార్కెట్లలో కోట్లు సంపాదించారని ప్రచారం చేసుకున్నారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే మంచి రాబడి వస్తుందని అందర్నీ నమ్మించారు. తాము పెట్టిన పెట్టుబడికి కోట్లు సంపాదించామని ఇంకా ఎక్కువ పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ వస్తుందని..అందుకే జనాల సొమ్ముతో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామని చెప్పారు.
కొంత మందికి డబ్బులు ఇచ్చి.. మిగతా అందరికీ బాండ్లు
మొదట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఆకర్షణీయమైన పథకాలతో తిరిగి డబ్బులు ఇచ్చారు. అలా డబ్బులు పొందిన వారు ప్రచారం చేయడమే కాదు.. మరికొంత సొమ్ము వవేసి అక్కడే జమ చేయడం ప్రారంభించారు. కొద్దిరోజులు పోయాక తమ వద్ద వారి సొమ్ము పేరుకుపోయిందని.. అంతా స్టాక్స్ లో పెడుతున్నామని భారీగా పెరుగుతోందని నమ్మిస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజులుగా ఎవరికీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. అప్పటికే వీరి మాయమాటలు నమ్మిన సుమారు 1,500 మంది అమాయకులు తమ కష్టార్జితాన్ని ఈ సంస్థలో పెట్టుబడులుగా పెట్టారు. హఠాత్తుగా ఓ రోజు బోర్డు తిప్పేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు
మదుపర్లకు నమ్మకం కలిగించేందుకు వారికి బాండ్ల రూపంలో కొన్ని పత్రాలను కూడా సంస్థ నిర్వాహకులు అందజేశారు. అవి ఎందుకు పనికి రావని తేలిపోయింది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు వాళ్లెవరు ఇంత ఈజీగా ఎలా మోసం చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.





















