Prakasam News: ఆడిట్ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి - దారి కాచి కళ్లల్లో కారం కొట్టి దారుణం, ప్రకాశం జిల్లాలో ఘటన
Andhra News: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఆడిట్ అధికారిపై దుండగులు విచక్షణారహితంగా దాడి చేశారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Attack On Audit Officer In Prakasam District: ఓ ప్రభుత్వ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో (Prakasam District) సంచలనం కలిగించింది. సహకార ఆడిట్ అధికారిగా ఉన్న పోలిశెట్టి రాజశేఖర్ (Polisetti Rajasekhar) ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో, అంబేడ్కర్ భవన్‌కు వెళ్లే దారిలోని అన్న క్యాంటీన్ వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు దుండగులు దారి కాచారు. కళ్లల్లో కారం కొట్టి.. అనంతరం కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టి గాయపర్చారు. స్థానికులు బాధితున్ని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్చారు. సమచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆస్పత్రికి వెళ్లి రాజశేఖర్‌తో మాట్లాడారు.
ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒకటో పట్టణ సీఐ వై.నాగరాజు తమ సిబ్బందితో వెళ్లి ఘటనపై ఆరా తీశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి వెనుక సహకార శాఖలోని కొందరు ఉద్యోగుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ ఆరా తీశారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అదే కారణమా.?
రాజశేఖర్ ప్రస్తుతం సహాయ ఆడిట్ అధికారిగా, సూపర్ బజార్ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో జిల్లా సహకార ఇంఛార్జీ అధికారిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో జిల్లాలోని కొన్ని సంఘాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలికితీశారు. డీసీఎంఎస్‌తో పాటు పొదిలి హౌసింగ్ సొసైటీ, పల్లామిల్లి, కొనకనమిట్ల తదితర ప్రాంతాల్లోని సహకార సంఘాలు, బ్యాంకుల్లో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ చేశారు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వైనాన్ని వెలికితీశారు.
దాడిని ఖండించిన ఉద్యోగ సంఘాలు
అటు, రాజశేఖర్‌పై దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కేసు విచారించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామని డిమాండ్ చేశారు. నిజాయతీ గల అధికారిపై భౌతిక దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Crime News: పండుగ నాడు దివ్యాంగురాలిపై అఘాయిత్యం, తెల్లవారేసరికి శవమై కనిపించిన నిందితుడు