Nizamabad: డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి పసుపు సంచుల లారీ హైజాక్ - పలుచోట్ల పసుపు విక్రయం
Turmeric Load Lorry Hijacked: నిజామాబాద్‌లో ఏకంగా పసుపు లోడుతో వెళ్తున్న లారీనే దుండగులు హైజాక్ చేశారు. వివిధ చోట్ల పసుపును విక్రయిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.
Turmeric Load Lorry Hijacked in Nizamabad: ఇప్పటివరకూ నగలు, డబ్బులు దోచుకోవడం చూశాం. కానీ ఏకంగా పసుపు సంచుల లోడుతో వెళ్తున్న లారీనే దుండగులు హైజాక్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం నుంచి రెండు రోజుల కిందట పసుపు లోడ్‌తో బయలుదేరిన లారీ గుంటూరు (Guntur) చేరుకోవాల్సి ఉండగా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో దుండగులు అడ్డగించారు. కారులో వచ్చిన కొందరు తాము ఆర్టీఏ అధికారులం అంటూ లారీని నిలిపేసి డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చారు. దీంతో స్పృహ కోల్పోయిన డ్రైవర్‌ను కిందకు దించారు. అనంతరం లారీని హైజాక్ చేసి నిజామాబాద్ తీసుకువచ్చారు.
పసుపు విక్రయం
లారీని హైజాక్ చేసిన దుండగులు పసుపును పలుచోట్ల విక్రయించారు. అనంతరం వాహనాన్ని నవీపేట మండలం జన్నేపల్లికి తరలించారు. లారీలో ఉన్న పసుపు సంచులను వేరే వాహనంలోకి మార్చి అన్నింటినీ విక్రయించాలని నిర్ణయించారు. నవీపేటకు చెందిన ఓ వ్యక్తి పసుపు సంచుల కోసం 3 వాహనాలతో జన్నేపల్లి వెళ్లాడు. అక్కడ పసుపు సంచులను ఈ వాహనాల్లోకి లోడ్ చేస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో డ్రైవర్ లారీని అక్కడే వదిలేసి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 3 వాహనాల డ్రైవర్లను పట్టుకొని విచారిస్తున్నారు. లారీలో మొత్తం రూ.50 లక్షల విలువైన పసుపు ఉందని పోలీసులు భావిస్తున్నారు. నిజామాబాద్ ఒకటో పట్టణ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Police: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ - అలాంటి ఫోన్ కాల్స్‌కు స్పందించారో ఇక అంతే!