సరెండర్ చేస్తుండగా గన్ మిస్‌ఫైర్.. బుల్లెట్ తగిలి కానిస్టేబుల్ మృతి, నంద్యాల జిల్లాలో ఘటన
Tragedy in Dhone | డ్యూటీ ముగిసిన తరువాత సర్వీస్ రివాల్వర్ సరెండర్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ మిస్ ఫైర్ అయింది. బుల్లెట్ తగలడంతో తీవ్ర రక్తస్రావమై కానిస్టేబుల్ చనిపోయిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.

నంద్యాల జిల్లా డోన్ రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే డీఎస్పీ శ్రీనివాసాచారి వెల్లడించారు.
రైల్వే డీఎస్పీ శ్రీనివాసాచారి తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ పెద్దయ్య శనివారం రాత్రి తన విధి నిర్వహణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో జీఆర్పీ అవుట్‌పోస్ట్ కార్యాలయంలో తన తుపాకీని సరెండర్ చేస్తుండగా, అది అకస్మాత్తుగా మిస్‌ఫైర్ అయింది. తుపాకీ నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ తగలడంతో పెద్దయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమీపంలోనే ఉన్న సెంట్రీ, మరో కానిస్టేబుల్ వెంటనే స్పందించి పెద్దయ్యను రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే పెద్దయ్య తీవ్ర రక్తస్రావం కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న రైల్వే మరియు సివిల్ పోలీసులు, డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో పెద్దయ్య భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం కింద మృతుడి కుటుంబానికి రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అధికారులు అందజేశారు. తుపాకీ ఏ విధంగా మిస్‌ఫైర్ అయిందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాఫ్తు చేస్తున్నారు.






















