Telangana Drugs Case : టోనీ ఎవరెవరి జాతకాలు బయట పెట్టనున్నాడు? ఆ బడాబాబులకు చిక్కులు తప్పవా ?
తెలంగాణ డ్రగ్స్ కేసులో టోనీని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. కేసీఆర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిన కారణంగా.. పోలీసులు ఎవర్నీ వదిలి పెట్టే అవకాశం లేదు.
మొన్నటిదాకా హైదరాబాద్ డ్రగ్స్ కేసుల్లో "కెల్విన్" అనే పేరు హైలెట్ అయ్యేది. చాలా కాలం విచారణ తర్వాత కెల్విన్‌ను నిందితుడిగా చూపించారు కానీ ఆయన కస్టమర్లను గుర్తించలేదని పోలీసులు తేల్చారు. ఇప్పుడు కెల్విన్‌కు బదులుగా "టోనీ" అనే పేరు హైలెట్ అవుతోంది. సైబరాబాద్ కొత్త కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి ఓ లింక్ కనిపెట్టి... టోనీ అనే బడా స్మగ్లర్‌ను అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. "టోనీ" డ్రగ్స్ లింకులు బయటకు తీస్తే హైదరాబాద్‌లోని బడా బాబుల జాతకాలు బయటకు వచ్చాయి.
టోనీ కస్టమర్ల జాబితాలో వీఐపీలు.. బడా వ్యాపారవేత్తలు
సమాజంలో పలుకుబడి ఉండి.. వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తేలింది. వీరు 30, 40 మంది వరకూ ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేశారు. కానీ చాలా మంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ సమస్య అనుకున్నంత చిన్నది కాదని తవ్వుకుంటూ పోతే ఎక్కడ తేలుతుందో అంచనా వేయడం కష్టమని .. కానీ తవ్వాల్సిందేనని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. ఆ కేసులోఇంకా పలువురు వీఐపీలు ఉన్నట్లుగా గుర్తించారు.
ఎవర్నీ వదిలి పెట్టవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలు
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. శుక్రవారం అత్యున్నత సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. " ఏ పార్టీకి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలి. ఎవర్నీ వదిలి పెట్టొద్దు" అని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు మరింత బలం వచ్చిటన్లయింది. టోనీని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను మరిన్ని వివరాలు సేకరించి మొత్తం గుట్టు బయట పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
తెరమీదకు కెల్విన్ పేరు.. మళ్లీ సినీ తారల కేసులు బయటకు వస్తాయా ?
అనూహ్యంగా ఇప్పుడు కెల్విన్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కెల్విన్, టోనీలకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక వేళ కెల్విన్‌కు సంబంధించిన ఆధారాలు బయటకు వస్తే మళ్లీ పాత డ్రగ్స్ కేసులు బయటకు వస్తాయి. కెల్విన్ కు సంబంధం ఉన్న డ్రగ్స్ కేసులు అంటే .. టాలీవుడ్ కేసులే. గతంలో అకున్ సభర్వాల్ నేతృత్వంలోని సిట్ ఆ కేసుల్ని దర్యాప్తు చేసింది. చివరికి టాలీవుడ్ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. తర్వాత ఈడీ కూడా దర్యాప్తు చేసింది. కానీ ఈడీకి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే డ్రగ్స్ కొనుగోలుకు అక్రమ నగదు చెలామణి కోణంలోనే విచారణ జరిపింది. ఇప్పుడు కెల్విన్‌కు సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటకు వస్తే మళ్లీ టాలీవుడ్ ప్రముఖుల మెడకు డ్రగ్స్ కేసు చుట్టుకోవడం ఖాయమే.
ఎవరెవరి జాతకాలు బయటకు రానున్నాయి..?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలను పోలీసులు యథాతథంగా అమలు చేస్తే ఇప్పటి వరకూ బయటకు రాని చాలా మంది వీఐపీల పేర్లు డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కర్నాటకలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో తెలంగాణలో కొంత మంది ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయి. వారికి నోటీసులు జారీ చేశారు. కానీ ఆ తర్వాత కేసు విచారణ ఏమయిందో స్పష్టత లేదు. ఇప్పుడు కూడా ఈ టోనీ, కెల్విన్ కేసులు ఛేదిస్తే సంచలనాలు నమోదవడం ఖాయమని చెప్పుకోవచ్చు.