Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!
Tirupati Crime : విద్యాబుద్ధులు చెప్పే లెక్చరర్ నీచమైన పనికి పూనుకున్నాడు. మాయమాటలతో విద్యార్థిని నమ్మించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు.
Tirupati Crime : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే తప్పుడు ఆలోచనలతో తప్పుడు బాటపట్టాడు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాల్సిన లెక్చరర్ కామాంధుడిగా మారి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాయమాటలతో లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. పైశాచికంగా ప్రవర్తిస్తూ అధ్యాపక వృత్తికే కళంకం తీసుకొచ్చాడు ఓ ప్రబుద్ధుడి. అంతే కాకుండా మైనర్ ను బలవంతంగా రెండో వివాహం చేసుకున్నాడు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
గంగవరం ఎస్సై సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన చలపతి (33) పలమనేరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. గత ఏడాది చలపతి ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకుని ఒక ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు. కానీ కళాశాలలోని యువతలు పట్ల చలపతి చనువుగా ఉండేవాడు. అంతేకాకుండా మైనర్లను లొంగ దీసుకునేందుకు వారికి రకరకాల గిప్ట్ లను సైతం ఇచ్చేవాడు. ఈ క్రమంలో అదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినితో చలపతి చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. ఆ యువతికి తీపి కబుర్లు చెప్పి ప్రేమ ముగ్గులోకి దించాడు. ఈ క్రమంలోనే గత బుధవారం చివరి పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్లాడు. తనకు ముందే పెళ్లైన విషయాన్ని దాచి తిరుపతిలోని ఓ ఆలయంలో బలవంతంగా మైనర్ ను పెళ్లి కూడా చేసుకున్నాడు. కొద్దిసేపటికే లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని గమనించిన యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. గురువారం రాత్రి చలపతిని కళ్లు కప్పి గంగవరం పోలీసు స్టేషన్ కు చేరుకుంది. లెక్చరర్ మాయమాటలు చెప్పి మోసం చేశాడని తల్లిదండ్రుల వద్ద యువతి విలపించింది. యువతితో కలిసి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ ఫిర్యాదుతో లెక్చరరు చలపతిపై గంగవరం ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బాలికతో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న శ్రీనివాసులు(46)లపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో ఓ హైస్కూల్ లోని విద్యార్థుల బస్సును నడుపుతున్నాడు. అయితే శ్రీనివాసులు అభం శుభం తెలియని విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. శ్రీనివాసులు ప్లాన్ ప్రకారం బస్సులో ప్రయాణించే విద్యార్థినులకు చాక్లెట్స్, బిస్కట్స్, ఐస్‌క్రీం ఆశ చూపేవాడు. ప్రతిరోజు విద్యార్థినులకు మాయమాటలు చెబుతూ వారికి దగ్గర అయ్యాడు. అయితే తమతో ఉంది ఓ మృగం అని ఆ విద్యార్ధినులు తెలుసుకోలేకపోయారు. ఇలా విద్యార్థినులను మచ్చిక చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వాటిని తన ఫోన్ లో ఫొటోలు తీసుకుని వాటిని చూస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు నమోదు
అయితే శుక్రవారం సాయంత్రం తంగేళ్ళపాళ్యం లోని ఓ స్కూల్ లో చదువుతున్న ఓ బాలికను లొంగ దీసుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు శ్రీనివాసులు. ఈ విషయం చుట్టుపక్కల ప్రయాణికులు గమనించి శ్రీనివాసులకు దేహశుద్ధి చేసి శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే రెండో పట్టణ పోలీసు స్టేషన్ పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుందని తెలియజేయడంతో కామాంధుడు శ్రీనివాసులును బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుచ్చినాయుడు కండ్రిగ పోలీసులు నిందుతుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.