(Source: ECI/ABP News/ABP Majha)
Tirupati Crime : అద్దె ఇంట్లో గుట్కా డెన్, వ్యాపారిలా వెళ్లి పట్టేసినా సెబ్ అధికారులు
Tirupati Crime : అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే అత్యాశలో అడ్డంగా బుక్కైయ్యాడో వ్యక్తి. ఇతర రాష్ట్రాల నుంచి సీక్రెట్ గా గుట్కా ప్యాకెట్ల పెద్ద మొత్తంగా తిరుపతికి తరలించి విక్రయిస్తున్నాడు. వ్యాపారస్థులలా వెళ్లిన అధికారులు అతడ్ని పట్టుకున్నారు.
Tirupati Crime : డబ్బుపై అత్యాశతో కొందరు అడ్డదారులు తొక్కి రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనుకుంటారు. తిరుపతికి చెందిన అలాంటి వ్యక్తి డబ్బు సంపాదనకు అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. అనుకున్న విధంగానే ప్లాన్ అమలు చేశాడు. ఇంతలో పోలీసులకు పక్కా సమాచారంతో అడ్డంగా దొరికిపోయాడు.
తిరుపతి అశోక్ నగర్ కు చెందిన పెంటంశెట్టి నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అంతంత మాత్రమే చదువుకోవడంతో ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడంతో కిరణా దుకాణాల్లో పనులు చేసుకునేవాడు. అయితే తాను అధికంగా సంపాదించాలని తిరుపతిలో తనకు ఉన్న పరిచయాలతో సలహాలు, సూచనలు తీసుకున్నాడు. కానీ వారు చెప్పిన సలహాలు సూచనలు నాగేంద్రకు నచ్చలేదు. వారు చెప్పినట్లు చేస్తే డబ్బులు సంపాదించలేం అని అనుకున్న నాగేంద్ర అక్రమ దారిలో సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తనకు పరిచయం ఉన్న వ్యక్తుల సహాయంతో గుట్కా అక్రమంగా తిరుపతికి వివిధ మార్గాల ద్వారా తెప్పించాడు. అనుకున్న విధంగానే తనకు బాగా పరిచయం ఉన్న దుకాణాలకు మాత్రమే గుట్కా సప్లై చేసేవాడు. గుట్కా సప్లైతో ఒక్కసారిగా అధిక డబ్బును చూశాడు నాగేంద్ర.
రూ.30 లక్షల గుట్కా స్వాధీనం
డబ్బుపై మరింత ఆశతో పెద్ద మొత్తంలో ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాను తిరుపతికి తెప్పించాడు నాగేంద్ర. అశోక్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో నిషేధిత గుట్కాను నిల్వ ఉంచాడు. కొద్ది కొద్దిగా దుకాణాలకు సరఫరా చేస్తూ వచ్చాడు. దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసిన ఎస్ఈబీ పోలీసులు సరఫరాపై దుకాణదారులను కూపీలాగారు. దీంతో నాగేంద్రకుమార్ పై నిఘా పెంచిన ఎస్ఈబీ పోలీసులు నాగేంద్ర గుట్కా నిల్వ ఉంచిన అద్దె ఇంటిలో ఉండంగానే గుట్కా సప్లై చేయాలని వ్యాపారి రూపంలో వెళ్లి నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్ర నిల్వ ఉంచిన గుట్కాను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురిఅయ్యారు. సుమారు 30 లక్షలు విలువ చేసే 150 బ్యాగుల గుట్కా మత్తు పదార్థాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకుని నిందుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
మత్తు పదార్ధాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు
మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఈ.బి అధికారి స్వాతి హెచ్చరించారు. మత్తు పదార్థాలు వాడకం వల్ల కలిగే ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.. ముఖ్యంగా స్కూల్స్, కళాశాల విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారని వీరి కోసం ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలు చేపట్టి స్కూల్స్, కళాశాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి స్వాతి చెప్పారు..