Tirumala News : గుజరాత్ భక్తులను నిలువునా ముంచిన దళారులు, 540 నకిలీ టికెట్లతో రూ.6.8 లక్షల స్వాహా
Tirumala News : తిరుపతిలోని ఓ లాడ్జీ నిర్వాహకులు గుజరాత్ భక్తులను నిలువునా ముంచారు. 540 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేస్తామని 6.8 లక్షలు వసూలు చేశారు.
Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అమాయక భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువు దోపిడి చేస్తున్నారు కొందరు దళారులు. టోకెన్లు లేని భక్తులను మాయమాటలు చెప్పి అధిక మొత్తంలో వారి వద్ద నుంచి నగదు వసూలు చేయడంతో పాటుగా నట్టేట ముంచుతున్నారు. తాజాగా గుజరాత్ నుంచి వచ్చిన ఓ భక్త బృందం నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి వారికి నకిలీ దర్శన టోకెన్లు అంటగట్టారు. దర్శన టోకెన్లను ప్రింట్ తీసుకునే సమయంలో జిరాక్స్ షాప్ యజమాని ఇచ్చిన క్లూతో విషయం తెలుసుకున్న భక్తులు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి నగదును తిరిగి బాధితులకు అప్పగించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
540 భక్తుల నుంచి రూ.6.8 లక్షలు స్వాహా
మూడు రోజుల క్రితం గుజరాత్ కు చెందిన 540 మంది భక్త బృందం వివిధ ఆలయాలను సందర్శిస్తూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తిరుపతిలో తెలిసిన వ్యక్తిని సంప్రదించారు. అయితే ఆ వ్యక్తి టూరిజంకు చెందిన మరోక వ్యక్తిని వారికి ఫోన్ ద్వారా పరిచయం చేయించారు. అయితే తమకు తెలిసిన లాడ్జ్ యజమాని ఉన్నారని, అతని ద్వారా దర్శనాలు చేయిస్తామని టూరిజానికి చెందిన వ్యక్తి భక్త బృందానాన్ని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన భక్తులు తిరుపతిలోని ఓ లాడ్జ్ యజమానికి దాదాపు 6.8 లక్షల రూపాయలు ఫోన్ ఫే, గూగుల్ ఫే ద్వారా నగదును జమచేశారు. అయితే భక్త బృందం నగదు జమ చేసిన మరుసటి రోజు టూరిజం, లాడ్జ్ యజమాని ఫోన్ చేసి దర్శన టోకెన్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ మాటలు నమ్మిన భక్తులు నేరుగా తిరుపతికి చేరుకుని టూరిజం శాఖకు చెందిన ఉద్యోగితో పాటు లాడ్జ్ యజమాని వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే తాము ముందస్తుగా ప్లాన్ చేసిన నకిలీ టోకెన్లను డాక్యుమెంట్ రూపంలో ఫోన్ లో సిద్ధం చేసి వారికి పంపించారు. వాటిని జిరాక్స్ తీసుకుని తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు.
నకిలీ టికెట్లను గుర్తించిన జిరాక్స్ షాపు యజమాని
అది నమ్మిన భక్త బృందం జిరాక్స్ కోసం షాపునకు వెళ్లగా ఆ టికెట్లను చూడగానే ఇవి నకిలో టోకెన్లని జిరాక్స్ షాపు యజమాని చెప్పడంతో తేరుకున్న భక్తులు తిరుపతిలోని టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు. అయితే బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు నమ్మిపోసిన గుజరాతీయులకు న్యాయం చేసేందుకు వివరాలు తీసుకుని టూరిజం, లాడ్జ్ యజమాని అదుపులోకి తీసుకుని నగదుని భక్త బృందానికి తిరిగి అప్పగించారు. అయితే భక్త బృందాన్ని మోసగించిన టూరిజం శాఖ ఉద్యోగి, లాడ్జ్ యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.