Crime News: దంపతుల అందమైన దోపిడీ- నమ్మినోళ్లకు వేశారు ఫేక్ ప్యాక్
Hyderabad News: బ్యూటీ పార్లర్ ప్రాంఛైజీ పేరిట బురిడీ కొట్టించిన దంపతులు..తెలంగాణ వ్యాప్తంగా 200 మంది నుంచి సుమారు 2కోట్లకు పైగా వసూలు చేసి పరారీ
బ్యూటీ పార్లర్ ఫ్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించిన ఓ జంట తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వందల మందిని మోసం చేసి 2 కోట్ల రూపాయలకు పైగానే కుచ్చుటోపీ పెట్టింది. అనతికాలంలో అధిక లాభాలు పొందవచ్చంటూ ఆశచూపి పెద్దఎత్తున నగదు వసూలు చేసింది. చెయిన్ లింక్ ప్రాంచైజీ కింద బ్యూటీపార్లకు అవసరమైన సామాగ్రితోపాటు శిక్షణ కూడా ఇస్తామని పలువురి నమ్మబలికింది. ఒక్కసారి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే....నిరంతరం లాభాలు పొందవచ్చని చెప్పడంతో పెద్దఎత్తున యువత పెట్టుబడులు పెట్టారు. వందలాది మంది నుంచి సుమారు 2 కోట్లకు పైగా నగదు వసూలు చేసి దంపతులు పరారవ్వడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ మోసంతో సంబంధమున్న ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.....
బ్యూటీపార్ల ప్రాంచైజీ ఆశ చూపి కోట్లకు కుచ్చుటోపీ
అనతికాలంలో కోట్లకు పడగలెత్తాలని ఆశపడి అడ్డదారులు తొక్కిన ఓ జంట కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. చెన్నై(CHENNAI) కు చెందిన షేక్ ఇస్మాయిల్ (ISMAIL) , ఆయన భార్య సమీనా( SAMEENA) అలియాస్ ప్రియాంక,అలియాస్ ప్రేమకుమారి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు.సులభంగా డబ్బులు సంపాధించాలని భావించిన ఈ జంట బ్యూటీపార్లర్ ప్రాంఛైజీలు ఇప్పిస్తామంటూ నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేయడంతో బాధితులు మోసపోయామని లబోదిబోమంటున్నారు. నిజాంపేటలోని ప్రగతినగర్ నెమలి బొమ్మల చౌరస్తాలో రెండేళ్ల క్రితం ‘రోస్ గోల్డ్ బ్యూటీ పార్లర్’(ROSE GOLD BEAUTY PARLOUR) ఏర్పాటు చేశారు. వీరితోపాటు సమీనా చెల్లెలు దేవకుమారి (DEVA KUMARI) అలియాస్ జెస్సికా, సోదరుడు రవి (RAVI) అలియాస్ చిన్నా బ్యూటీ పార్లర్ యజమానులుగా వ్యవహరించేవారు. నగరానికి చెందిన విశ్వతేజను ఉద్యోగిగా చేర్చుకున్నారు. బ్యూటీ పార్లర్ విభాగంలో తమ సంస్థకు మంచి పేరుందని, ఫ్రాంచైజీలు ఇచ్చి అవసరమైన సరకులు ఇవ్వడంతోపాటు నెలకు 35 వేల రూపాయల చొప్పున వేతనం ఇప్పిస్తామంటూ గొప్పగా ప్రచారం చేశారు. వీరి మాటలు నమ్మిన నిజాంపేట వాసులతోపాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వందలాది మంది ఫోన్‌లో సంప్రదించారు. ఫ్రాంచైజీకి 3 నుంచి .5 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. సుమారు 200 మంది నుంచి సుమారు 2 కోట్లకు పైగా నగదు సేకరించారు.
ప్రాంఛైజీ ఏర్పాటు చేయకుండా సాగదీత
ఏడాది కాలంగా అందినకాడికి దోచుకున్న ఈ జంట... గతేడాది సెప్టెంబరు వరకు ఫ్రాంచైజీ ఇస్తామని సాగదీశారు. బాధితులకు అనుమానమొచ్చి రెండ్రోజుల క్రితం ప్రగతినగర్‌లోని కార్యాలయానికి రాగా అక్కడ బోర్డు లేదు. ఆరా తీయగా వారు ఖాళీ చేసి పరారైనట్లు తెలుసుకున్నారు. బాధిత ఫిర్యాదుతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దేవకుమారితోపాటు సంస్థ ఉద్యోగి విశ్వతేజను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సమీనా దంపతులతోపాటు ఆమె సోదరుడు రవి పరారీలో ఉన్నట్లు పోలీసులు( POLICE) తెలిపారు. ముందు, వెనక ఆలోచించకుండా కనీసం సంస్థ కార్యాలయం ఎక్కడు ఉందో కూడా తెలుసుకోకుండా ఎవరికిపడితే వారికి డబ్బులు కడితి ఇలాగే నష్టపోతారని పోలీసులు హెచ్చరిస్తున్నారు.