Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Crime News: తల్లిని చంపి శరీరాన్ని ముక్కలు చేసి వండుకుని తినేందుకు యత్నించిన నిందితునికి ఉరిశిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేయగా దీన్ని తోసిపుచ్చింది.
Bombay High Court Uphelds Death Penalty Of Man Who Killed Mother: ఓ వ్యక్తి కన్నతల్లినే చంపి శరీర భాగాలను ముక్కలుగా కోసి వాటిని వండేందుకు యత్నించాడు. ఈ కేసులో నిందితునికి ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించగా.. ఆ నిర్ణయాన్ని బాంబే హైకోర్టు (Bombay High Court) సమర్థించింది. ఇలాంటి నేరాలు అత్యంత అసాధారణమైనవని, ఇందులో శిక్ష తగ్గించేందుకు ఆస్కారమే లేదని అభిప్రాయపడింది. 2017లో మహారాష్ట్రలో (Maharastra) సంచలనం సృష్టించిన ఈ కేసును 'నరమాంస భక్షణ' కేసుగా గుర్తిస్తూ శిక్షను ఖరారు చేసింది.
ఇదీ జరిగింది
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సునీల్ రమా కుచ్‌కొరవీ (38) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి డబ్బులివ్వలేదనే కారణంతో అతని తల్లిని దారుణంగా హతమార్చాడు. 2017, ఆగస్ట్ 28న జరిగిన ఈ పాశవిక ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తల్లి శరీర భాగాలను ముక్కలుగా చేసి వాటిని వండేందుకు యత్నించాడు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు.. సునీల్‌కు మరణ శిక్ష విధిస్తూ 2021లో తీర్పు వెలువరించింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేయగా.. జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చౌహాన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా ఆ శిక్షను సమర్థించింది.
'అత్యంత అసాధారణ నేరం'
ఈ సందర్భంగా ధర్మాసనం ఇది అత్యంత అసాధారణ నేరంగా పేర్కొంది. 'మేం ఈ కేసును అత్యంత అరుదైన కేసుల్లో ఒకటైన 'నరమాంస భక్షణ' కేసుగా పరిగణిస్తున్నాం. నిందితుడు కన్న తల్లిని చంపడమే కాకుండా ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేశాడు. కొన్ని భాగాలను ఉడికించి తినేందుకు సిద్ధమయ్యాడు. ఇది నరమాంసం తినడం కిందకే వస్తుంది.' అని జస్టిస్ చౌహాన్ పేర్కొన్నారు. ఇంతకంటే భయంకరమైన, అనాగరిక చర్యను గతంలో ఎన్నడూ చూడలేదని జస్టిస్ మోహితే దేరే అభిప్రాయపడ్డారు. ట్రయల్ కోర్టు తీర్పులో మార్పులు చేసేందుకు ఎటువంటి ఆస్కారం కనిపించడం లేదన్నారు. తనకు మరణశిక్ష రద్దు చేయాలన్న నిందితుడి అభ్యర్థనను తిరస్కరించారు.
Also Read: I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?