Nizamabad News: నిజామాబాద్ అర్బన్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మహత్య, కారణం ఏంటంటే
Telangana Election News: నిజామాబాద్ నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఇతను నివాసం ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
Nizamabad MLA Candidate Suicide: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన వ్యక్తి అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. యమగంటి కన్నయ్య గౌడ్ అనే 36 ఏళ్ల వ్యక్తి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఇంటిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు. అయితే, ఇతను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఇతను నివాసం ఉంటున్నాడు. ఆదివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకున్నాడు.
పోలీసులు, కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కన్నయ్య గౌడ్‌కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. ఉరి వేసుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. కన్నయ్య కుమార్ గౌడ్ ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తన ఎన్నికల అఫిడవిట్ కూడా సైబర్ నేరగాళ్లు దొంగిలించారని చెబుతున్నారు.
ఇతను ఇటీవలే కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాడు. పైగా రెండు రోజుల్లో గృహప్రవేశం కూడా ఉంది. ఈలోపు కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.