Hyderabad Road Accident: దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి
Telangana Crime News: మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.
Engineering students dies in Road Accident | హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా లారీని ఢీకొట్టడంతో విషాదం నెలకొంది. కారులో ప్రయాణిస్తున్న వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీలో చదువుతున్న ముగ్గురు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 5 సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు అతివేగంతో కారు నడుపుతూ, ఎదురుగా వస్తున్న కెమికల్ లారీని ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. అతి వేగంగా, నిర్లక్ష్యంగా స్కోడా కారు డ్రైవ్ చేసిన విద్యార్థి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు వెల్లడించారు. మృతులను వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆకాష్, అస్మిత్, హరిలుగా పోలీసులు గుర్తించారు.
తల్లిదండ్రులు విద్యార్థులపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అందులోనూ బీటెక్ పూర్తి చేసి ఒకట్రెండు సంవత్సరాలలో కుటుంబానికి అండగా నిలుస్తారనుకుంటే కొందరు విద్యార్థులు జీవితాలు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయి వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారని పోలీసులు చెప్పారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు డ్రైవ్ చేయడం ద్వారా, అది వారి ప్రాణాలతో పాటు అవతలి వాహనంలో ఉన్నవారు, పాదచారుల ప్రాణాలు బలి తీసుకుంటుందన్నారు.