(Source: ECI/ABP News/ABP Majha)
కాగజ్‌నగర్ కేజీబీవీ విద్యార్థి మృతి- ముగ్గురు అధికారులపై వేటు!
కాగజ్ నగర్ కేజీబీవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు.
కాగజ్‌నగర్ కేజీబీవీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుకుంటున్న ఐశ్వర్య అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతిచెందడం బాధకరమని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం అన్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పాఠశాల సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కస్తూర్భా విద్యాలయం ఎస్ఓ స్వప్న, ఏఎన్ఎం భారతి, డ్యూటీలో ఉన్న టీచర్ శ్రీలతను సస్పెండ్ చేస్తూ.. అదనపు కలెక్టర్ రాజేశం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. నష్ట పరిహారం కోసం తక్షణ సహాయం కింద రూ.50,000 బాధిత కుటుంబానికి అందించారు. నష్టపరిహారం కింద ఆ కుటుంబానికి రూ. 15 లక్షలు వచ్చేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
కుమురం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని కస్తూర్భా పాఠశాలలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ప్రతిరోజూలాగే మంగళవారం రాత్రి పాఠశాల వసతి గృహంలో భోజనం చేసి పడుకుంది. బుధవారం ఉదయం నోటి నుంచి నురగ రావడంతో.. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలిక చికిత్స పొందతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు.. ఐశ్వర్య మృతదేహంతో కస్తూర్బా పాఠశాల ముందు ధర్నాకి దిగారు.
మృతదేహంతో ధర్నాకి దిగిన కుటుంబ సభ్యులు..
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఐశ్వర్య చనిపోందని ఆరోపిస్తున్నారు. ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పాల్వాయి హరీష్ బాబు కుటుంబ సభ్యులకు మద్దతు తెలిపారు. విద్యార్థికి న్యాయం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడరు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
నిన్నటికి నిన్న ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య..
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఎంటెక్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం మరువక ముందే మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మెగా కపూర్.. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం గుర్తించిన స్థానికులు, హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే మెగా కపూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడువంటి విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతనెల 31న ఎంటెక్ విద్యార్థి రాహుల్ తానుంటున్న హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. రాహుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.