TG NAB: డ్రగ్స్ తీసుకుంటే క్షణాల్లో పట్టేస్తారు - తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి కొత్త అస్త్రాలు
Telangana News: డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లో గుర్తించేలా కొత్త టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వినియోగించనున్నారు.
New Test Kits For Telangana Anti Narcotics Bureau For Drugs Test: తెలంగాణలో పోలీసులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇకపై డ్రగ్స్ తీసుకున్న వారిని క్షణాల్లోనే గుర్తించేలా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా, డ్రగ్స్ టెస్టులకు సంబంధించి కొత్త కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ కిట్స్‌తో కేవలం నిమిషాల వ్యవధిలోనే ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా.? లేదా.? అనేది నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు. అంతే కాకుండా ఈ కిట్స్ ద్వారా యూరిన్ శాంపిల్ కూడా లేకుండా సదరు వ్యక్తి నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారా.? లేదా.? అనేది తెలిసిపోతుందని పేర్కొన్నారు. ఈ కిట్స్ సాంకేతికంగా రుజువయ్యాయని.. దీనికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్‌ను కూడా న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయని చెప్పారు. పబ్బుల్లో, ప్రైవేట్ పార్టీల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈ కిట్స్ ద్వారా వారిని క్షణాల్లోనే పట్టుకోవచ్చని చెబుతున్నారు. యువత మత్తుకు బానిసై.. జీవితాలను ఛిద్రం చేసుకోవద్దని.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అటు, అధికారులు, పోలీసులు ఎంత కట్టుదిట్టం చేస్తున్నా ఇంకా కొన్ని చోట్లు డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా, హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద నలుగురు వ్యక్తులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. వారి వద్ద ఒకటిన్నర కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేశామని.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయిచైతన్య తెలిపారు. నిందితులపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.