Srikakulam News : కన్నీటి ధారలతో కన్నకొడుక్కి తలకొరివి, ఓ తల్లి గుండెకోతే ఈ సంఘటన
Srikakulam News : శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడికి తలకొరివి పెట్టాల్సిన స్థితి ఓ తల్లికి వచ్చింది. ఆ తల్లి కష్టం చూసి గ్రామం మొత్తం కన్నీరు కార్చింది.
Srikakulam News : దేవుడు ప్రతిచోట ఉండలేక అమ్మను రూపొందించాడని అంటుంటారు. అమ్మను మించిన దైవం లేదంటారు. నిజమే తమ బిడ్డలపై అమ్మ చూపే ప్రేమ, వాత్సల్యం వెలకట్టలేనివి. నవమాసాలు మోసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికందే వయసులో దూరం అవ్వడం అంటే ఆ తల్లికి అంతకన్నా పెద్ద కష్టం ఇంకేమైన ఉంటుందా. కన్న కొడుకు ఎప్పటికీ తిరిగి రానీ అనంతలోకాలకు వెళ్లిపోతే ఆ తల్లి కడుపు కోత ఎవరూ తీర్చలేరు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తాను తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆ తల్లి ఊహించలేదు. విధి కన్నెర్రకు బలైన తన కన్న కొడుకుకి కన్నీటి ధారలతో తలకొరివి పెట్టిన ఓ మాతృమూర్తి దయనీయ పరిస్థితి ఈ సంఘటన.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన గేదెల ఢిల్లమ్మకు పెళ్లయిన ఐదేళ్లకే భర్త చనిపోయాడు. ఇంక కొడుకే జీవితంగా భావించి బతుకు సాగించింది. తన ఆశలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుంది. కొడుకు గేదెల మోహన్ రావు(24) విశాఖపట్నంలో బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కూలి పనులు చేసుకునే ఢిల్లమ్మకు కొడుకు మోహన్ రావు ఆర్థికంగా అండగా నిలుస్తూ ఇప్పుడిప్పుడే కాస్త నిలదొక్కుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 10న ఇంటి పనులు చేస్తుండగా భవనంపై నుంచి మోహన్ రావు జారి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో మోహన్ రావు తలతో పాటు శరీర భాగాలకు గట్టి దెబ్బలు తగిలాయి. వెంటనే మోహన్ రావును విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ రావు మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన కాపుగోదాయవలస గ్రామానికి తీసుకొచ్చారు. కుటుంబంలో ఎవరూ లేకపోవడంతో తల్లి ఢిల్లమ్మే కొడుక్కి తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. ఈ సంఘటను చూసిన గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.
గుండెలవిసేలా రోధించిన తల్లి
అనారోగ్యంతో భర్త మరణించిన నాటికి కొడుకు మోహన్ రావు వయసు ఐదేళ్లు. అప్పటి నుంచి కొడుకే ప్రపంచంగా బతుకుతోంది ఢిల్లమ్మ. ఎన్నో ఆటుపోటులను భరిస్తూ కొడుకును పెంచి పెద్ద చేసింది. చేతికందిన కొడుకు ఇంటి బాధ్యతలు తీసుకున్నాడు. కూలీనాలి చేస్తూ తల్లిని చూసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని ఘటన ఆ తల్లిని మళ్లీ తీవ్ర విషాదంలోకి నెట్టింది. భవనం పై నుంచి జారి పడి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డ మృతిని తట్టుకోలేక ఢిల్లమ్మ గుండెలవిసేలా రోధించిన తీరు చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకు చితికి తానే కొరివి పెట్టాల్సి రావడంతో ఆమె వేదనకు అంతులేకుండా పోయింది. ఢిల్లమ్మ పరిస్థితిని చూసి గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. రెండు దశాబ్దాల క్రితం భర్త ఇప్పుడు కొడుకు శాశ్వతంగా దూరమవడంతో ఆ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది.