TDP Leader Attacked : పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై హత్యాయత్నం
TDP Leader Attacked : శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావు కారుపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మణరావు తీవ్రంగా గాయపడ్డారు.
TDP Leader Attacked : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు కుత్తుం లక్ష్మణరావుపై దుండగులు హత్యాయత్నం చేశారు. లక్ష్మణరావు కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి స్థానికులు చేరుకోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సోంపేట వైపు బస్సులో పరారయ్యారు. గాయపడిన లక్ష్మణరావును గౌతు శిరీష ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ నేతలే చేశారని టీడీపీ ఆరోపణ
పలాస మండలం టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఆయన కారులో వెళ్తుండగా రామకృష్ణాపురం వద్ద కాపుకాసి దాడి చేశారు. ఈ దాడిలో లక్ష్మణరావుకు తీవ్రగాయాలు అవ్వగా కారు ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మహిళా నేత గౌతు శిరీష సంఘటనా స్థలానికి వెళ్లారు. స్థానికుల సాయంతో లక్ష్మణరావును అంబులెన్స్‌లో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మణరావుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడి వైసీపీ కార్యకర్తల పనేనని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను శిక్షించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ దాడి ఎవరు చేశారనే విషయాన్ని తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. వైసీపీ నేత నర్తు నరేంద్ర తమ్ముడు ప్రేమ్ నాపై దాడి చేశాడని బాధితుడు లక్ష్మణరావు తెలిపారు. మొత్తం ఐదుగురు కారులో వచ్చి తన కారును ఢీకొట్టారని, ఆ తర్వాత దాడి చేశారన్నారు.
"చిన్నప్పుడు వినేవాళ్లం కడపలో దాడులు జరిగాయని, ఇప్పుడు పలాసలో చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఇంకెక్కడా జరగడలేదు దాడులు. ఈ పశువుల మంత్రి వచ్చాక పలాసలో ఎవరూ ఊహించని విధంగా దాడులు జరుగుతున్నాయి. దొంగ అందర్నీ దొంగ అన్నట్లు మంత్రి తీరు ఉంది. ఏదో దర్బార్ పెట్టి టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎందుకు నువ్వే అధికారంలో ఉన్నావ్ కదా, నిరూపించండి. లక్ష్మణరావుపై మంత్రికి సవాల్ చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించు లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయమని సవాల్ చేశారు. అలా అని నాలుగు గంటలు కూడా కాలేదు. తన మనుషుల్ని పంపి దాడి చేయించారు. పట్టపగలు హైవేపై లక్ష్మణరావుపై దాడి చేశారు. మేము కాస్త లేట్ అయితే లక్ష్మణరావును చంపేసేవాళ్లు. పోలీసులు ఇప్పుడు వచ్చారు. ఎవరు దాడి చేశారో బాధితుడు చెబుతున్నాడు. పోలీసులు కేసు పెడతారో లేదో చూద్దాం. నేను వాళ్లను వదిలిపెట్టను. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టను. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా?" -గౌతు శిరీష