Srikakulam: అసిస్టెంట్‌ను చంపి బీచ్‌లో పాతేసిన హార్స్ రైడింగ్ ట్రైనర్! కారణం ఏంటంటే
పోలీసులు శనివారం చిన్న కొవ్వాడ సముద్రం తీరంలో వెతకగా డెడ్ బాడీ దొరికింది. గ్రామస్తుల నుంచి పోలీసులు పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలలో ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.
Srikakulam News: వివాహేతర సంబంధం నేపథ్యంలో గుర్రపు స్వారీ శిక్షకుడి సహాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం (Srikakulam News) జిల్లా రణస్థలం మండలం చినకొవ్వాడ సముద్ర తీరంలోని రొయ్యల చెరువుల సమీపంలో పాతేసిన మృత దేహాన్ని విశాఖ పోలీసులు బయటకు తీయించడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం (Vizag News) జిల్లా గాజువాకకు (Gajuwaka) చెందిన పతివాడ గౌరీసాయి గుర్రాలను పెంచి స్వారీ నేర్పించడం, పందేల్లో పాల్గొనడం, వాటిని విక్రయించడం చేస్తుంటాడు. ఆర్కే బీచ్‌లో సందర్శకుల వద్ద కొంత మొత్తం వసూలు చేసి వారిని గుర్రాలపై తిప్పుతుంటాడు. ఎంవీపీ కాలనీ (MVP Colony) పోలీస్ స్టేషను పరిధి మారికవలసలో నివాసం ఉంటున్నాడు. అతని వద్ద అదే ప్రాంతానికి చెందిన రిక్క జగదీశ్వరరావు అలియాస్ శివ (19) కొన్నేళ్ల నుంచి సహాయకుడిగా పని చేస్తున్నాడు. గౌరీసాయికి నేర చరిత్రతో పాటు రౌడీషీట్ ఉంది. ఒక కేసులో అతను జైలుకు వెళ్లాడు.
ఆ సమయంలో గుర్రాల పర్యవేక్షణ, లావాదేవీలను గౌరీసాయి భార్య ఆధ్వర్యంలో జగదీశ్వరరావు చూసుకునేవాడు. ఈ క్రమంలో ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. గౌరీసాయి జైలు నుంచి వచ్చిన తర్వాత అతని సహాయకుడిపై అనుమానం వచ్చింది. మార్చి 4న చినకొవ్వాడ (ChinnaKovvada) సమీపంలోని రొయ్యల చెరువుల వద్దకు గౌరీసాయి, గాజువాక ప్రాంతానికి చెందిన అతని స్నేహితులు, జగదీశ్వరరావుతో సహా ఎనిమిది మంది ఆటోలో వచ్చారు. మద్యం, గంజాయి తీసుకున్న అనంతరం సముద్రం ఒడ్డున సరుగుడు తోటలోకి వెళ్లారు. అక్కడ ఉన్న సర్వే రాయితో జగదీశ్వరరావు తలపై కొట్టి హతమార్చారు. ముందుగానే సిద్ధం చేసుకున్న గొయ్యిలో మృతదేహాన్ని కప్పేశారు.
నెల రోజుల నుంచి తన కుమారుడు కనిపించకపోవడంతో జగదీశ్వర రావు తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గౌరీ సాయిని పోలీసులు దర్యాప్తు చేయగా తానే హతమార్చానని అంగీకరించాడు. గతంలో రణస్థలం మండలం (Ranasthalam Mandal News) కొచ్చెర్లకు చెందిన బస్వా గోవింద రెడ్డికి గుర్రం విక్రయించానని.. రొయ్యల చెరువుల ప్రాంతంలో అతనికి స్వారీ చేయడంపై శిక్షణ ఇచ్చానని తెలిపాడు. ఆ ప్రాంతం బాగా తెలియడంతో రొయ్యల చెరువుల వెనుక సముద్ర తీరంలో జగదీశ్వరరావును హత మార్చి మృతదేహాన్ని గొయ్యి తీసి కప్పేశామని వివరించాడు. ఈ నేపథ్యంలో నిందితుడిని వెంటబెట్టుకుని ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్ సీఐ హెచ్. మల్లేశ్వరరావు, క్లూస్ టీం సహా పోలీసులు శనివారం (ఏప్రిల్ 22) చినకొవ్వాడ తీరానికి వచ్చారు.
తహసీల్దారు ఎస్. కిరణ్ కుమార్ సమక్షంలో మృత దేహాన్ని వెలికి తీయించారు. శరీర భాగాలన్నీ కుళ్లిపోవడంతో పంచనామా అనంతరం వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. హత్య కేసులో నిందితుడితో పాటు పది మంది పాత్ర ఉందని, వారిలో కొందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సీఐ చెప్పారు. ప్రస్తుతం ఇక్కడి రొయ్యల చెరువుల్లో సాగు లేకపోవడం, కార్యకలాపాలేవీ సాగకపోవడం.. జన సంచారం లేకపోవడంతో పట్టపగలే ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు.