(Source: ECI/ABP News/ABP Majha)
Srikakulam Crime News: వీధుల్లో ఈడ్చుకెళ్తూ వ్యక్తిపై దాడి - నెట్టింట ప్రత్యక్షమైన వీడియోలు!
Srikakulam Crime News: సడెన్ గా ఓ ఇంట్లోకి వచ్చిన వ్యక్తి యజమానిపై దాడి చేశాడు. ఇష్టమొచ్చినట్లుగా కొడుతూ వీధుల్లోకి ఈడుచ్చుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Srikakulam Crime News: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి గోవిందపురంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. మిట్ట మధ్యాహ్నం ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మరో వ్యక్తిని దారుణంగా కొట్టాడు. వీధుల్లోకి ఈడ్చుకుంటూ వస్తూ దాడి చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూండి గోవిందపురానికి చెందిన వి.యర్రయ్యను ఇంట్లో ఎవరు లేని సమయంలో అదే గ్రామానికి చెందిన గొరకల వెంకటరావు తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. దాడి చేస్తూ వీధుల్లోకి ఈడ్చుకొచ్చాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అంబులెన్సుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన 108 సిబ్బంది బాధితుడిని పలాస సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గతంలో వెంకటరావు, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన భూవివాదంపై కేసు నమోదైంది. ఈ కేసులో బాధితుడు యర్రయ్యను సాక్షిగా పెట్టారు. అయితే అన్నాదమ్ముల మధ్య జరిగిన భూవివాదంలోకి తనను లాగొద్దని, తనకు తెలియకుండా ఎందుకు సాక్ష్యం పెట్టావని అడగడంతో కక్ష పెంచుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజులుగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, తాజాగా ఇంటికి వచ్చి గుండె, ఇతర శరీర భాగాలపై విపరీతంగా కొట్టినట్లు తెలిపారు.
నూజివీడు పీఎస్ పై మహిళల దాడి..
నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తలు స్టేషన్ ను ముట్టడించడంతో పోలీసులు స్టేషన్ తలుపులు మూసివేశారు. ఏలూరు జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను రాజ్ కుమార్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. వారం రోజుల క్రితం భర్త కొడుతున్నాడని ఏడుస్తూ ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కుమార్తె కోసం ఐశ్వర్య తల్లిదండ్రులు అల్లుడి ఇంటికి వెళ్లారు. అల్లుడి ఇంటి వద్ద తమ కుమార్తె కనిపించకపోవడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. ఆ తర్వాత రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నూజివీడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు నూజివీడు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాదు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమ కూతురు జాడ చెప్పాలంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహారించారు.
చింతమనేని పీఎపై దాడి
ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ సహా మరో ముగ్గురు టీడీపీ నేతలు గాయపడ్డారు. జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంత మందితో కలిసి జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళ్తుండగా అలుగులగూడెం వెంతెన వద్ద వైసీపీ వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూనే, కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొప్పాక సమీపంలోని పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, అదే సమయంలో తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకొని తమపై దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంత మంది ఉన్నారని ఆరోపించారు.