Telangana News: తెలంగాణలో ఈదురుగాలులతో వర్ష బీభత్సం - ఆరుగురు మృతి
Telangana News: తెలంగాణలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
People Died Due To Shed Collapsed In Nagarkurnool: తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో ఆదివారం గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భారీ వర్షం, ఈదురుగాలులకు కోళ్ల ఫారం ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. మృతుల్లో ఇద్దరు కూలీలు, యజమాని మల్లేష్, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. అటు, ఇదే జిల్లాలోని తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు.
భారీ వృక్షం విరిగి..
అటు, మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో ఈదురుగాలులకు ఓ భారీ వృక్షం విరిగి బైకర్‌పై పడింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
మరోవైపు, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, మల్కాజిగిరి, తుర్కయాంజల్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అటు, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురంలో గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అలాగే, ఘట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి బీభత్సానికి ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సంగారెడ్డి జిల్లాలో..
అటు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి పడి ఓ మేస్త్రీ ప్రాణాలు కోల్పోయాడు. భవనానికి ప్లాస్టరింగ్ చేస్తుండగా ఏడో అంతస్తు నుంచి జారిపడి బెంగాల్‌కు చెందిన మమ్జుల్ షేక్ (33) అనే మేస్త్రీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.