30 గ్రాముల హెరాయిన్ స్మగ్లింగ్ చేసిన మహిళకు ఉరి శిక్ష - సింగపూర్‌లో 20 ఏళ్ల తరువాత తొలిసారి అమలు
సింగపూర్ లో ఓ మహిళకు ఉరి శిక్ష పడింది. గడిచిన 20 సంవత్సరాల కాలంలో తొలిసారి శుక్రవారం ఓ మహిళను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం.
సింగపూర్ లో ఓ మహిళకు ఉరి శిక్ష పడింది. గడిచిన 20 సంవత్సరాల కాలంలో తొలిసారి శుక్రవారం ఓ మహిళను ఉరి తీసింది సింగపూర్ ప్రభుత్వం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఇద్దరు దోషులకు సింగపూర్ ప్రభుత్వం మరణి శిక్ష విధించింది. 2018లో వీళ్లను అరెస్టు చేశారు.
హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు దోషులను సింగపూర్ పోలీసులు 2018లో పట్టుకున్నారు. వారిలో ఒకరు 56 ఏళ్ల వ్యక్తి కాగా అతనిని బుధవారం ఉరి తీశారు. కాగా ఆ వ్యక్తితో పాటు అరెస్ట్ అయిన మహిళను శుక్రవారం ఉరి తీశారు. ఉరి తీసిన మహిళ పేరు సారిదేవి దామని. ఆమె వయసు 45 ఏళ్లు.
30 గ్రాముల హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో ఆమెకు కూడా 2018లో ఉరిశిక్ష విధించారు. ఇద్దరు వ్యక్తుల ఉరి శిక్ష గురించి వారి కుటుంబాలకు వారం రోజుల ముందుగానే సమాచారం అందించారు. గత 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. 2004 లో ఓ 36 ఏళ్ల మహిళకు డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో ఉరిశిక్ష అమలు చేశారు.
అయితే వీరిద్దరి ఉరిశిక్షను నిలిపివేయాలని కొన్ని మానవ హక్కుల సంఘాలు సింగపూర్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి కూడా. అయినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదు. అయితే సింగపూర్ లో ఇప్పటి వరకు హత్యలు, కిడ్నాప్ లు వంటి తీవ్రమైన నేరాలకు మాత్రమే మరణ శిక్ష విధించారు. కానీ కొంత కాలం ముందు నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కూడా నిరోధించేందుకు అత్యంత కఠినమైన చట్టాలను అమలు చేస్తుంది.
సింగపూర్ చట్ట నిబంధనల ప్రకారం..500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ ను అక్రమంగా రవాణా చేస్తే కచ్చితంగా వారికి సింగపూర్ ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. కరోనా మహమ్మరి నేపథ్యంలో ఈ ఉరిశిక్షలను కొంతకాలం పాటు సింగపూర్ ప్రభుత్వం నిలిపివేసింది.
కరోనా ఉద్ధృతి కొంచెం తగ్గడంతో మళ్లీ ఉరి శిక్షలను అమలు చేస్తుంది. అలా ఇప్పటి వరకు సుమారు 13 మందిని ఉరి తీసింది. కొంత కాలం క్రితం ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కూడా మరణశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే