Kolkata: కోల్‌కతా కేసులో కీలకంగా ఆ మూడు ఫోన్ కాల్స్, ఆ గుట్టు బయట పడుతుందా?
Kolkata Case: కోల్‌కతా బాధితురాలి తల్లిదండ్రులకు హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కాల్ చేసి కూతురి గురించి చెప్పారు. ఆ ఫోన్ కాల్స్‌లో పూర్తిగా ఏదీ చెప్పకుండా దాచి పెట్టారు.
Kolkata Doctor Death Case: కోల్‌కతా హత్యాచార ఘటన బెంగాల్ రాజకీయాల్లో మంట పుట్టించింది. బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్‌లా మారిపోయింది ఈ వ్యవహారం. CBI విచారణ జరుగుతుండగానే ఈ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిరసనకారులపై మమతా సర్కార్ వ్యవహరించిన తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీ రాజకీయం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే అటు బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎక్కడా ధైర్యం కోల్పోకుండా తట్టుకుని నిలబడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆ రోజు ఫోన్ కాల్ వచ్చిన సమయాన్ని గుర్తు చేసుకుని బాధ పడుతున్నారు. తమ కూతురి గురించి ఎవరు కాల్ చేశారు..? ఏం మాట్లాడారు..అనే వివరాలు ఇటీవల పంచుకున్నారు. ఆర్‌జీ కర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బాధితురాలి తల్లిదండ్రులకు కాల్ చేశాడు. "మీ కూతురి ఆరోగ్యం బాగోలేదు. త్వరగా హాస్పిటల్‌కి రండి" అని చెప్పాడు. ఆ తండ్రికి ఏమీ అర్థం కాలేదు. ఏమైందో చెప్పండి అని అడగగా "తన హెల్త్ బాలేదు. అడ్మిట్ చేస్తున్నాం. కాస్త త్వరగా రాగలరా" అని అన్నాడు.
ఇది కూడా అర్థం కాక బాధితురాలి తండ్రి అసలు ఏమైందో చెప్పాలని అడిగారు. "మీరు హాస్పిటల్‌కి వచ్చిన తరవాత అక్కడ డాక్టర్స్ అన్ని వివరాలూ చెబుతారు. మీ ఫోన్ నంబర్ దొరికింది. అందుకే వెంటనే కాల్ చేసి చెబుతున్నా" అని అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు అని అడిగితే హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెట్ అని సమాధానమిచ్చి కాల్ కట్ చేశాడు. ఆ తరవాత కాసేపటికే మరోసారి కాల్ చేశాడు. ఈ సారి మరింత ఆందోళనకరంగా మాట్లాడినట్టు బాధితురాలి తండ్రి వివరించారు. ఇక మూడోసారి కాల్ చేసి అసలు విషయం చెప్పాడు. "మీ కూతురు చనిపోయింది. బహుశా ఆత్మహత్య చేసుకుందేమో. పోలీసులందరూ ఇక్కడే ఉన్నారు. మేం హాస్పిటల్‌లోనే ఉన్నాం. అందరి ముందూ మీకు కాల్ చేస్తున్నాను" అని చెప్పాడు.
ఈ ఫోన్ కాల్స్‌పైనే తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని సూటిగా చెప్పకుండా ఇలా పదేపదే తడుముకుంటూ, అంత ఆందోళనగా చెప్పారంటే ఏదో దాస్తున్నారన్న సందేహం ఉందని అంటున్నారు. ఆగస్టు 9వ తేదీన ఈ ఘటన జరగ్గా మరుసటి రోజు నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సంజయ్ రాయ్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఇటీవలే సీబీఐ అధికారులు లై డిటెక్టర్ టెస్ట్ చేశారు. నిందితుడితో పాటు హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కీ ఈ టెస్ట్ చేశారు. ఈ అన్ని వివరాలూ కలిపి త్వరలోనే ఓ నివేదిక తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనల్ని మరిచిపోవడం అందరికీ అలవాటైపోయిందని అసహనం వ్యక్తం చేశారు.