Hyderabad drugs case: డ్రగ్స్ తీగ లాగితే పెద్దల డొంకలు కదులుతున్నాయి - కొంపల్లి మల్నాడు రెస్టరెంట్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
Malnadu restaurant: కొంపల్లి మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పరారీలో ఉన్న వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు.

Kompally Malnadu restaurant drug case:హైదరాబాద్ కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దూకుడుగా దర్యాప్తు చేస్తోంది. అతి పెద్ద డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్లుగా గుర్తించారు ఈ కేసులో కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అన్నమనేని కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు , ఈగల్ టీం సూర్య అన్నమనేనిను కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ సమీపంలో పట్టుకున్నారు. అతనిదే ఆ హోటల్. అతని కారులో జరిపినప్పుడు 10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల OG కుష్ (గంజాయి రకం), 1.6 గ్రాముల ఎక్స్‌టసీ గుళికలు స్వాధీనం చేసుకున్నారు.
కొకైన్ మహిళల చెప్పుల హీల్‌లో దాచి, గులాబీ రంగు పెట్టెలో ప్యాక్ చేసి, న్యూ ఢిల్లీ నుండి "ఫాతిమా" అనే ఫేక్ పేరుతో శ్రీ మారుతి కొరియర్ ద్వారా పంపినట్లు గుర్తించారు. విచారణలో సూర్య, 2021 నుండి 2025 వరకు డ్రగ్స్ వినియోగం నుండి పూర్తిస్థాయి సరఫరాకు మారినట్లు వెల్లడించాడు. హైదరాబాద్‌లోని ప్రముఖ పబ్‌లు ప్రిజం, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, క్వేక్ అరేనా, ఎక్సోరా, బ్రాడ్‌వే వంటి చోట్ల డ్రగ్స్ వినియోగించినట్లు ఒప్పుకున్నాడు. సూర్య తన బంధువు ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు, హర్ష, నవదీప్ రెడ్డి వంటి వ్యక్తులతో కలిసి డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఢిల్లీ, బెంగళూరు, గోవాలలో నైజీరియన్ డ్రగ్ ట్రాఫికర్లు నిక్, జెర్రీ, డెజ్‌మండ్, స్టాన్లీ, ప్రిన్స్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా అంగీకరించాడు.
ఈగల్ టీం 9 పబ్‌లపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. ఈ పబ్‌లలో డ్రగ్ పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు.
వచ్చే వారం విచారణకు హాజరు కావాలని పబ్ యజమానులకు నోటీసులు జారీ చేశారు. వాక్ కోరా పబ్ యజమాని రాజా శేఖర్, కోరా పబ్ యజమాని పృథ్వి వీరమాచినేని, బ్రాడ్‌వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టిపై కేసులు నమోదయ్యాయి. ఈ ముగ్గురు సూర్యతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. సూర్య తన రెస్టారెంట్ , కారును డ్రగ్స్ నిల్వ సరఫరా కేంద్రంగా ఉపయోగించాడు. అతను నిక్ అనే నైజీరియన్ సరఫరాదారుడికి డిజిటల్ చెల్లింపుల ద్వారా రూ. 1.39 లక్షలు , రూ. 41,000 ATM ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసినట్లు గుర్తించారు.
డ్రగ్స్ హైదరాబాద్‌లోని టెకీలు, వైద్యులు, పబ్ డైరెక్టర్లు, వ్యాపారవేత్తలకు సరఫరా చేశారు. - మొత్తం 15 మంది వ్యాపారవేత్తలపై కేసులు నమోదయ్యాయి, వీరిలో యశ్వంత్, జస్వంత్, నవదీప్, పవన్, రాహుల్, విక్రమ్ రెడ్డి, తనుజ్, రోహిత్ మాదిశెట్టి వంటి వారు ఉన్నారు. ప్రిజం, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్, బ్లాక్ 22, వాక్ కోరా, బ్రాడ్‌వే వంటి పబ్‌లలో డ్రగ్ వినియోగం కోసం ప్రత్యేక గదులు అందించినట్లు సూర్య పోలీసులకు చెప్పాడు. సూర్య మరియు ఇతర అరెస్టయిన వ్యక్తులపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి .





















