Swami Chaitanyananda: విద్యార్థినులపై లైంగిక వేధింపుల కేసులో స్వామి చైతన్యానంద అరెస్ట్
విద్యార్థినులు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తనను తాను దేవదూతగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Self Styled Godman Swami Chaitanyananda Arrested: తనను తాను దేవదూతగా ప్రకటించుకున్న స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్టయ్యాడు. విద్యార్థినులు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్‌లోని ఒక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు స్వయం ప్రకటిత ‘గాడ్‌మ్యాన్’ చైతన్యానంద సరస్వతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా పోలీసులు కళ్లుగప్పి పరారీలో ఉన్నాడు. కాగా ఆయనను ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పట్టుకొని అరెస్ట్ చేశారు.
విద్యార్థినులు, ఆర్థికంగా బలహీనంగా ఉండే మహిళలే లక్ష్యం
స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ స్వామి పార్థసారథి సౌత్‌వెస్ట్ ఢిల్లీలోని శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తన పదవిని అడ్డుపెట్టుకొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నాడు. అదేకాకుండా ఇన్స్టిట్యూషన్లో చదివే విద్యార్థినులకు కొంతకాలంగా యువతులకు అశ్లీల మెసేజ్‌లు పంపుతున్నాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. విద్యార్థినులు, ఆర్థికంగా బలహీనంగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారితో బలవంతంగా లైంగిక సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
Delhi Police apprehended Swami Chaitanyananda Saraswati @ Parth Sarthy, late at night, from Agra.
— ANI (@ANI) September 28, 2025
He is accused of allegedly molesting female students pursuing PGDM courses under the EWS scholarship and forgery.
(Pic Source: Delhi Police) pic.twitter.com/m2cpaRsnln
దుష్ప్రవర్తనపై పీఠానికి లేఖలు
స్వామి చైతన్యానంద స్వామిపై లైంగిక వేధింపులతోపాటు పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. అతడి దుష్ప్రవర్తనపై జూలై చివరలో ఓ విద్యార్థిని పీఠానికి లేఖ రాసింది. ఆగస్టు నెల ప్రారంభంలో ఓ వైమానిక దళ అధికారి లేఖ పంపింది. సంస్థలోని చాలా మంది విద్యార్థులు, వైమానిక దళ సిబ్బంది పిల్లలను వేధిస్తున్నట్లు ఆ లేఖల్లో వారు పేర్కొన్నారు.
30 మందికి మహిళా విద్యార్థులతో వర్చువల్ సమావేశం
ఆ లేఖలను పీఠం పాలక మండలి సీరియస్‌గా తీసుకుంది. పరిస్థితులను తెలుసుకునేందుకు ఆగస్టు 3న 30 మందికి పైగా మహిళా విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. వారు తాము ఎదుర్కొన్న వేధింపులకు వారికి తెలియజేశారు. కాగా వర్చువల్ సమావేశం జరిగినప్పటి నుంచి స్వామి పార్థసారథి తప్పించుకొని తిరుగుతున్నాడు.
రూ.30 కోట్లకు పైగా దుర్వినియోగం
పారిపోయిన వెంటనే అతను దాదాపు రూ.60 లక్షలు విత్‌డ్రా చేసుకున్నాడు. శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో మొత్తం రూ.30 కోట్లకు పైగా దుర్వినియోగం చేసినట్లు భావిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొద్దిరోజుల క్రితమే కోర్టు కొట్టివేసింది. దీనితో అతడి అరెస్టుకు మార్గం సుగమమైంది.





















