Secunderabad Agnipath Protest : సికింద్రాబాద్ అల్లర్ల కేసు, ఆవుల సుబ్బారావు, శివలను ఇవాళ అరెస్టు చేసే అవకాశం!
Secunderabad Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్యంసం కేసులో ఆవుల సుబ్బారావు, శివలను రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు ముందు నిందితులతో సుబ్బారావు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు.
Secunderabad Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు, శివను రెండో రోజు విచారిస్తున్నారు. రైల్వేస్టేషన్ లో విధ్వంసానికి ముందు నిందితులతో సుబ్బారావు మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. ఇవాళ ఆవుల సుబ్బారావు, శివను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
పరారీలో 8 మంది
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో ఇప్పటికే 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. అంతకు ముందు 45 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. బుధవారం ఏ-2 పృథ్వీరాజ్ తో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని పోలీసులు తెలిపారు. నిన్న అదుపులోకి తీసుకున్న వారిని సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన అనంతరం నిందితులను చంచల్ గుడా జైలుకి తరలించారు. దీంతో ఇప్పటి వరకు 55 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కుట్రపూరిత అల్లర్లు
సైనిక నియామకాల్లో అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్లు కుట్రపూరితమని రైల్వే పోలీసులు రిమాంట్ రిపోర్టులో తెలిపారు. అగ్నిపథ్ అమల్లోకి వస్తే నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మారిపోతామని, కేంద్ర ప్రభుత్వ ఆస్తులు, రైల్వేస్టేషన్లను ధ్వంసం చేయడం ద్వారా దీన్ని అడ్డుకోవాలని ఆర్మీ అభ్యర్థులు నిర్ణయించుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ అమల్లోకి వచ్చిన వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకున్నారన్నారు. సికింద్రాబాద్ తర్వాత ఏపీలోని గుంటూరు, విజయవాడ, విశాఖ రైల్వేస్టేషన్లలలో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసినట్లు ఆధారాలు కూడా సేకరించారు.
రిమాండ్ రిపోర్టులో విషయాలు
ఆందోళనకారులు వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడల్లోని 12 డిఫెన్స్ కోచింగ్ అకాడమీల్లో శిక్షణ పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసంలో మొత్తం 63 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కామారెడ్డికి చెందిన మధుసూదన్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా పోలీసులు చేర్చారు. నిందితుల్లో 56 మంది నిందితులు ఆర్మీ ఫిజికల్, మెడికల్ ఫిట్‌నెస్ లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని నివేదికలో పేర్కొన్నారు. కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడంతో దానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని అల్లర్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ గ్రూప్, హకీమ్ పెట్ ఆర్మీ సోల్జర్స్ గ్రూప్స్, చలో సికింద్రాబాద్ ARO3 గ్రూప్, మరికొన్ని గ్రూపులు క్రియేట్ చేశారని పేర్కొన్నారు. ఈ గ్రూపు ద్వారా సికింద్రాబాద్ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలు ఈ విధ్వంసానికి సహకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.