Kakatiya University: కేయూ హాస్టల్‌లో ఊడిపడిన శ్లాబ్ - రిజిస్ట్రార్‌ను నిలదీసిన విద్యార్థులు, అర్ధరాత్రి ఉద్రిక్తత
Telangana News: వరంగల్ కేయూ హాస్టల్ గదిలో శుక్రవారం రాత్రి శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.
Slab Collapsed In Kakitiya University: హన్మకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్శిటీ (Kakatiya University) పోతన ఉమెన్స్ హాస్టల్ గదిలో అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. హాస్టల్ గదిలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఈ ఘటనపై విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగగా ఉద్రిక్తత నెలకొంది. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. హాస్టల్‌లో ఉండాలంటే నిరంతరం భయపడుతున్నామని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో భోజనం సరిగా ఉండడం లేదని.. కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారని ఆరోపించారు. సదుపాయాలు సరిగ్గా లేవని పాములు, కుక్కలు వస్తున్నాయని వాపోయారు. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్‌ను నిలదీశారు.
రిజిస్ట్రార్‌ను నిలదీసిన విద్యార్థులు
విషయం తెలుసుకున్న వర్శిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి హాస్టల్‌ను పరిశీలించేందుకు వెళ్లగా విద్యార్థులు ఆయన్ను నిలదీశారు. ఆయనతో వాగ్వాదానికి దిగుతూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా, గత నెల 29న హాస్టల్ గదిలో ఫ్యాన్ ఊడి పడి పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. అప్పుడు హాస్టల్‌ను సందర్శించిన అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ ఘటన మరువక ముందే మరోసారి శ్లాబ్ ఊడిపడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Nirmal News: తుపాకులతో యువకుల రీల్స్, జనం వెంట పడి కామెడీ - అరెస్ట్ చేసిన పోలీసులు