Rajahmundry: రాజమండ్రిలో రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్, రాత్రి పదైతే చాలు ఒంటరిగా వెళ్లే వారిపై దాడులు
Rajahmundry: రాజమండ్రిలో రాత్రి పదైతే చాలు ఆకతాయిలు చెలరేగిపోతున్నారు. రాత్రుళ్లు ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి బ్లేడ్లు, సర్జికల్ బ్లేడ్లుతో దాడులు చేస్తున్నారు.
Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాత్రి పదిగంటలు దాటుతుంటే చాలు కొందరు ఆకతాయిలు చెలరేగిపోతోన్నారు. బ్లేడ్లు, సర్జికల్ బ్లేడ్లుతో దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవల నగర పరిధిలో చోటుచేసుకున్న పలు సంఘటలే ఇందుకు ఉదాహరణలు. నిర్మానుష్య ప్రదేశాలు, నగర శివారు ప్రాంతాలే కాకుండా పలు సందర్భాల్లో ఆర్టీసీ కాంప్లెక్స్ , రైల్వే స్టేషన్, లాలాచెరువు, శాంతి నగర్, ఆనంద్ నగర్, సోమాలమ్మసెంటర్, కాతేరు, ఇన్నీసుపేట, కంబాలపేట, ధవళేశ్వరం, బాలాజీపేట తదితర ప్రాంతాల్లో ఈ తరహా దాడులు ఎక్కువవుతున్నాయని తెలుస్తోంది. ఇలా అనేక ప్రాంతాల్లో ఒంటిరిగా రాకపోకలు సాగిస్తున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు పటిష్టమైన నిఘా ఉంచి ఆకతాయిల ఆటకట్టించాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
రాత్రి పదైతే చాలు
చాలా మంది యువకులు మద్యానికి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలై ఈజీ మనీ కోసం ఇటువంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి పది గంటలు దాటిందంటే చాలు రోడ్ల మీదకు ఇద్దరు ముగ్గురు చొప్పున గ్రూపులుగా వస్తూ ఒంటరిగా వెళ్తున్నవారిని టార్గెట్ చేస్తున్నారు. బస్సు, లేదా ఆటోలు దిగి ఇళ్లకు నడిచి వెళ్తున్నవారిని టార్గెట్ చేసుకుని వారిని అటకాయించి వారి జేబుల్లో ఉన్న డబ్బులను, మెడలో చేతికి ఉన్న బంగారపు వస్తువులను లాక్కుని పరారవుతున్నారు. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డుపై, బైక్లపై వెళ్తున్నవారిని అటకాయించి నానా హైరానా సృష్టిస్తున్నారు. ఎదురు తిరిగితే బ్లేడ్లు, సర్జికల్ బ్లేడ్లు, పదునైన చాకులు చూపించి బెదిరిస్తున్నారని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో దాడులకు సైతం తెగ బడుతున్నారని బాధితులు కొందరు పోలీసులు వద్ద వాపోయినట్లు సమాచారం. ఇటీవలే రాజమండ్రి రూరల్ ధవళేశ్వరానికి చెందిన ఓ యువకుడు అర్ధరాత్రి రాజమండ్రి రైల్వే స్టేషన్ లో రైలు దిగి ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఆల్కట్ తోట వద్ద ముగ్గురు యువకులు అడ్డగించి చాకుతో దాడి చేసి ఆ యువకుని వద్ద నుంచి సెల్ ఫోన్, జేబులో ఉన్న నగదును లాక్కెళ్లారు. ఈ దాడిలో కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆ యువకుడు మృతి చెందాడు. ఇదే తరహాలో తాడితోట వద్ద, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఇలా అనేక ప్రాంతాల్లో దాడులు ఎక్కువయ్యాయి. దీంతో రాజమండ్రి వాసులు హడలెత్తిపోతున్నారు.
మఫ్టీలో నిఘా
గతంలో రాజమండ్రి అంటే బ్లేడ్ బ్యాచ్ గుర్తుకు వచ్చేది. అయితే మళ్లీ ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ తో పాటు సర్జికల్ బ్లేడ్లు, పదునైన చాకులతో నేరగాళ్లు సామాన్యులపై విరుచుకుపడి దోచుకెళ్తుండడంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. రాజమండ్రి వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆయా పనుల కోసం నగరం వచ్చిన వాళ్లు కూడా ఈ తరహా సంఘటనలు చవిచూశారని పలువురు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిపై రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివరణ ఇస్తూ రాజమండ్రిలో పెరుగుతున్న క్రైం రేట్ పై ప్రత్యేక నిఘా పెట్టామని, రాత్రివేళల్లో కొన్ని టీమ్ లు మఫ్టీలో తిరుగుతున్నారని చెబుతున్నారు. బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి 30 మందిపై కేసులు నమోదు చేశామని, రాజమండ్రి అర్బన్ పరిధిలో ఎటువంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.