Ganji Prasad Murder Case : "అడ్డా"లో ప్లాన్ చేశారు - అడ్డంగా నరికేశారు ! గంజి ప్రసాద్ మర్డర్ ప్లాన్ బయట పెట్టిన పోలీసులు
వైఎస్ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అడ్డా అనే దాబాలో ప్లాన్ చేసి..తెల్లవారే అడ్డంగా నరికేశారని పోలీసులు తెలిపారు.
ఏలూరు జిల్లా జి. కొత్తపల్లిలో వైఎస్ఆర్‌సీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితుల్ని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. హత్యకు సంబంధించి మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీ బజారయ్యను పేర్కొన్నారు. జీ. కొత్తపల్లిలో వైఎస్ఆర్‌సీపీ నేతల మధఅయ ఆధిపత్య పోరు వలన గంజి ప్రసాద్ హత్య జరిగిందని ఎస్పీ ప్రకటించారు. ఏప్రిల్ 26వ తేదీన నిందితుడు సురేష్ కత్తులను సేకరించాడని.. బజారయ్య ప్రోదల్బంతోనే ముగ్గురు నిందితులు హత్య చేశారని ఎస్పీ తెలిపారు. పాత వివాదాలను దృష్టిలో ఉంచుకుని గంజి ప్రసాద్ ను ఇప్పడు చంపకపోతే, మీకు మళ్ళీ అవకాశం రాదని మిగిలిన నిందితులను బజారయ్య రెచ్చగొట్టారన్నారు. గంజి ప్రసాద్ హత్యను ఎప్పటికప్పుడు బజారయ్య ఆరా తీశారని.. రెండు రోజులు హత్య కోసం రెక్కీ కూడా నిర్వహించారని ఎస్పీ తెలిపారు.
నాగార్జున అనే నిందితుడు హతుడు గంజి ప్రసాద్ కదలికలను గమనిస్తూ, ఇతర నిందితులకు సమాచారం ఇస్తే మిగిలిన నిందితులు నరికి చంపారన్నారు.
గంజి ప్రసాద్ హత్యకు బజారయ్య అంతకు ముందుకూడా ఓ సారి ప్లాన్ చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కోడూరి రవితేజ అలియాస్ జాన్ అనే అతనిని పురికొల్పి గంజి ప్రసాద్ ను హత మార్చాలనుకున్నారు. కాని జాన్ ప్రేమ వివాహం చేసుకోవడం వలన ఈ ప్రయత్నం విరమించుకున్నారు. కాని బజారయ్య అదును కోసం వేచి చూస్తూ తన సొంత వర్గాన్ని పెంచుకుంన్నాడు. బజారయ్యతో పాటు నిత్యం అతని వెంటే ఉండే రెడ్డి సత్యనారాయణ , మండవల్లి సురేష్, శానం హేమంత్, గంజి నాగార్జున, మరికొంత మందిని చిన్న చిన్న విషయాలలో రెచ్చగొడుతూ అనుచరులుగా మార్చుకున్నాడు.
29వ తేదీన జంగారెడ్డి గూడెం లో కల “ అడ్డా” డాబా లో రెడ్డి సత్యనారాయన మందు పార్టీ ఇచ్చారు. మద్య తాగుతూనే ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. హత్య చేసిన రోజున బజారయ్య తన అద్దె కారులో ప్రసా ద్ ఇంటి వైపు ఊరి చివరకు వెళ్లి పెట్రోల్ బంకు ఫోటో, హత్య జరగవలసిన ప్రదేశం ఫోటో తన ఫోన్ వాట్సాప్ ద్వారా నాగార్జున కి పెట్టాడు. పాల కోసం బయలుదేరిన గంజి ప్రసాద్‌ను ఎదురుగా వెళ్లి మోటార్ సైకిల్ తో గుద్దించారు. ప్రసాద్ కింద పడిపోగానే సురేష్, హేమంత్, మోహన్ లు గంజి ప్రసాద్ ని మెడ కుడి వైపు విచక్షణ రహితంగా నరికారు. దీంతో స్పాట్‌లోనే గంజి ప్రసాద్ చనిపోయాడు.
హతుడు.. నిందితుడు ఇద్దరూ వైఎస్ఆర్‌సీపీకి చెందినవారే. అయితే నిందితులకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందన్న కారణంగా .. పరామర్శకు వచ్చిన ఆయనపై గ్రామస్తులు దాడి చేశారు.